నాలుగు ట్యాంకర్ల సీజ్
రామచంద్రపురం, జూన్ 28, ప్రభ న్యూస్ : ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న స్థావరాలపై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తెల్లాపూర్ లో జోరుగా అక్రమ నీటి దందా, ఇష్టారాజ్యంగా నీటి అక్రమ రవాణా, అడుగంటుతున్న భూగర్భ జలాలు అనే శీర్షికన ఆంధ్రప్రభ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు కొల్లూరు పోలీసుల సహకారంతో తెల్లాపూర్ లో అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న స్థావరాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ నిలుచున్న నాలుగు ట్యాంకర్లను సీజ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి వెంటనే విద్యుత్ కనెక్షన్లను తొలగింపజేశారు.
భూగర్భ జలాలను తోడేస్తూ అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తెల్లాపూర్ లోని సర్వేనెంబర్ 396, 504లలో వ్యవసాయం కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న బోర్ల నుండి అక్రమార్కులు నీటిని తోడుతూ వ్యాపారం చేయడంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.