(ప్రభ న్యూస్, ఉమ్మడి మెదక్ బ్యూరో): మద్యం షాపుల లైసెన్స్ జారీ ప్రక్రియకు రాష్ట ప్రభుత్వం రెండు నెలల ముందుగానే శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా అన్ని జిల్లాలో డ్రా తీయగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ అధికారులు డ్రా తీశారు. డ్రా పద్ధతిన ఎంపిక చేసిన రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కు జిల్లా అధికారులు పంపించారు. ఈనెల 4 నుండి 18 తేదీ వరకు మద్యం షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో మాదిరిగానే ఒక్కో షాప్ కోసం దరఖాస్తు రుసుమును రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు నెలల ముందుగానే టెండర్ ప్రక్రియ
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లైసెన్స్లకు నవంబరు 30వ తేదీ వరకు గడువు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలు ముందుగానే మద్యం షాపులు కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటె ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు డిసెంబర్ లో ఉంటాయని ఆ మేరకు కసరత్తు జరుగుతుండగా రాజకీయ నిపుణులు కూడా అదే పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం వర్షాకాల సమావేశం అనంతరం సి ఎం కేసిఆర్ అసెంబ్లీ ని ఏ క్షణంలోనైనా రద్దు చేసి ముందస్తుగా ఎలక్షన్స్ వెళ్లే అవకాశం ఉందని ఫలితంగానే మద్యం షాపులను టెండర్లు ఖరారు చేశారని, ముందస్తు వెళ్తే కోడ్ అడ్డం వస్తాయనే ముందుగా మద్యం షాపులు కేటాయింపు అంటూ సర్వత్రా చర్చ జరుగుతుంది.
గతంలో మాదిరిగానే ఫీజు
రెండు నెలల ముందుగానే మద్యం షాపుల వేలం ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుండగా రెండు నెలల విక్రయాల కాలాన్ని కోల్పోవాల్సి వస్తుందని మద్యం దుకాణ దారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో మాదిరిగానే దరఖాస్తు ఫీజు2 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 డిసెంబరు 1 నుంచి 2025 నవంబరు 30వ తేదీ వరకు నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. గతంలో మాదిరి
గానే లాటరీ పద్దతి ద్వారా లైసెన్స్ దారులను ఎంపికచేయనున్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎక్సైజ్ టాక్స్నగతంలో మాదిరిగా 6 విడతల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
జనాభా ప్రాతిపదికన మద్యం షాపులు ఫీజు ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపాదికన మద్యం షాపుల లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు. 2011జనాభా లెక్కల ఆధారంగా ఐదు వేలలోపు జనాభా ఉన్న ఏరియాలో ఏడాదికి 50 లక్షలు, 5001 నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ఏరియాలో 55 లక్షలు, 50,001 జనాభా నుంచి లక్ష జనాభా ఉన్నప్రాంతాల్లో 60 లక్షల రూపాయల ఫీజును రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 1,00,001నుంచి ఐదు లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు 65 లక్షలు, 5,00,001నుంచి 20,00,000 జనాభా ఉన్న ఏరియాకు 85 లక్షలు, 20 లక్షలపైగా జనాభా ఉన్న ఏరియాలకు కోటి 10 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మద్యం షాపు వేలంలో ఒకే దరఖాస్తు వస్తే ఆ మద్యం షాపును టెండర్ కోట్ చేసిన వ్యక్తికి ప్రకటిస్తారు. ఒకే షాపుకు ఒకటికి మించి దరఖాస్తులు వచ్చిన సందర్భంలో లాటరీ పద్దతి ద్వారా లైసెన్స్ దారులను ఖరారు చేస్తారు.
డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించవచ్చు
మద్యం షాపుకు దరఖాస్తు కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును డీడీ లేదా చలన్ రూపంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ కార్యాలయంలో రెండు లక్ష రూపాయల డీడీ లేదా చాలన్ జత చేసి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు మూడు స్లాబ్ పరిధిలోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లుగా విభజించి ఫీజును నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని వైన్స్కు 50 లక్షలు, నగర పంచాయతీ పరిధిలోని వైన్స్ లకు 55 లక్షల రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 65 లక్షల రూపాయలు ఎక్సైజ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్ రూమ్ ఫీజు కూడా ఎక్సైజ్ టాక్స్ లో జతచేసే వసూళ్లు చేస్తున్నారు. మద్యం అమ్మకాలు లైసెన్సు ఫీజుల్లో 10 రెట్ల వరకు మార్జిన్ విధానాన్ని అమలు చేయనున్నారు. మద్యం అమ్మకాలు లైసెన్స్ ఫీజు కంటే 10 రెట్లకు మించి జరిగితే మార్జిన్ను నాలుగు శాతానికి కుదించారు. మద్యం వ్యాపారులకు ఆర్డినరీ మద్యం అమ్మకాలపై 27 శాతం, మీడియం రకం అమ్మకాలపై 20 శాతం, బీర్ పై 20 శాతం మార్జిన్ను ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాలో రిజర్వేషన్ల వారిగా మద్యం షాపులు కేటాయింపు
సంగారెడ్డి జిల్లాలో
సంగారెడ్డి జిల్లాలో గురువారం జిల్లా కలెక్టర్ శరత్ సమక్షంలో మద్యం దుకాణాల రిజర్వేషన్ డ్రా తీశారు. మొత్తం 101 వైన్ షాపులకు డ్రా తీయగా 24 షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్ సి కేటగిరికి 13 , ఎస్టీ సామాజిక వర్గానికి-2 గౌడ సామాజిక వర్గానికి 09 కేటాయించారు.
మెదక్ జిల్లాలో
మెదక్ జిల్లాలో గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో మద్యం దుకాణాల రిజర్వేషన్ డ్రా తీశారు. మొత్తం 49 వైన్ షాపులకు డ్రా తీయగా ఎస్ సి కేటగిరికి 6 , ఎస్టీ వర్గానికి-1 గౌడ సామాజిక వర్గానికి 09 కేటాయించారు.
సిద్దిపేట జిలాల్లో
సిద్దిపేట జిల్లాలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమక్షంలో మద్యం దుకాణాల రిజర్వేషన్ డ్రా తీశారు. 93 వైన్ షాపులకు డ్రా తీయగా ఎస్ సి కేటగిరికి 9 , గౌడ సామాజిక వర్గానికి 16 కేటాయించారు.
ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి…హరికిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల వ్యాప్తంగా ఈ నెల 4 నుండి 18 తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ నెల 21వ తేదీన లాటరీ పద్దతి ద్వారా లైసెన్స్ ల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నాం. 22వ తేదీలోగా లైసెన్స్ ఫీజు మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలి.