సిద్దిపేట జిల్లాలో వింత చోటుచేసుకుంది. చిన్నగుండవెల్లి గ్రామ శివారులో ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలో మూడు రోజుల క్రితం 80 ఏళ్ల లచ్చయ్య పడిపోయాడు. అతడు సిద్దిపేట బారా ఇమామ్ కాలనీకి చెందిన వ్యక్తి. అయితే కూలి పని చేస్తూ కాలుజారి బావిలో పడిపోయాడు. అతడు బావిలో పడిపోయిన విషయం ఎవరికీ తెలియకపోవడంతో మూడురోజుల పాటు బావిలోనే గడిపాడు. గురువారం ఉదయం ఓ రైతు బావిపక్కన వ్యవసాయ పోలానికి వెళ్లడంతో బావిలో నుండి అరుపులు వినపడ్డాయి. దీంతో ఆ రైతు బావి వద్దకు వెళ్లి చూడగా ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడని గమనించాడు. దీంతో వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో వ్యవసాయ బావిలోకి దిగి తాళ్ళు కట్టి వృద్దుడిని సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం లచ్చయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయం గురించి తెలియక లచ్చయ్య తప్పిపోయాడు అనుకుని కుటుంబ సభ్యులు మూడు రోజులుగా ఊరితో పాటు బంధువుల ఇళ్లలో వెతుకుతున్నామని చప్పారు. బావిలో పడిన తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసి రక్షించినందుకు సిద్దిపేట రూరల్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి లచ్చయ్య కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: చిరుతపులి నుంచి సోదరులను కాపాడిన బర్త్ డే కేక్