బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని, టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, ఎల్ఐజీ భారతీ నగరి కాలనీల్లో మంత్రి హరీశ్‌రావు బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీల్లో పేదల సుస్తి పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని అన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ హాస్పిటల్స్‌లో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు.. ఈ ఆస్పత్రులను వినియోగించుకోవాలని పేదలకు హరీశ్‌రావు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital