మెదక్ : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగునంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాలసిన చర్యలతో పాటు ప్రజలలో అవగాహన పెంపొందించుటకు కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ యస్.హరీశ్ ఆధికారులను ఆదేశించారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పటు మున్సిపాలిటీ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగునంగా స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్లుల వద్ద రేడియం స్టిక్కర్లు వంటివి ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వెంట ముళ్ళ పొదలు, చెట్ల పొదలు తొలగిస్తూ మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ వంటి ప్రధాన రహదారుల్లో ఏడాదికేడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రధానంగా నర్సాపూర్ రోడ్‌లోని మంబోజిపల్లి, రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి ప్రాంతాలలో ప్రమాదాలకు ఎక్కువ అవకాశమున్నందున ఈ సంవత్సరం జిల్లాలో 458 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ ప్రమాద ప్రాంతాలను మరోమారు సందర్శించి ప్రమాదాలకు కారణాలు ఏమిటో క్షుణంగా తెలుసుకొని నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్యాచ్‌వర్క్‌లు ఎప్పటికప్పుడు చేపట్టాలని బైపాస్‌రోడ్డు నుండి ప్రధాన రహదారి పైకి వచ్చే మార్గంలో స్పీడ్ బ్రేకర్‌ల నిర్మించాలని, అత్యవసర సమయంలో వాహనాలు రహదారి పక్కన ఆపడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. మెదక్-నర్సాపూర్ నుండి హైద్రాబాద్ వెళ్లే రహదారిలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తినుబండారాలు అందిస్తూ రోడ్లపై వాహనాలు నిలుపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. కోతులు రోడ్డుపైకి రాకుండా నర్సాపూర్ అర్బన్ పార్కులో, అక్కడి నుండి గుమ్మడిదల వరకు మూడు నాలుగు ప్రాంతాలలో ఫుడ్‌జోన్‌లుగా ఏర్పాటు చేసి వాహనదారులు అక్కడ తినుబండారాలు అందించేలా చూడాలని జిల్లా అటవీశాఖ అధికారి, రహదరిపై వాహనాలు సాఫీగా నడిచేలా రోడ్డుపై వాహనాలు నిలపకుండా సైన్‌బోర్డులు పెట్టి, అతిక్రమిస్తే ఫైన్ వేయాలని పోలీసులకు సూచించారు. పోలీస్, ఆర్‌టిఓ, జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులు సమిష్టిగా ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణకు చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించి పకడ్భందీగా అమలు పరచాలన్నారు. రాత్రివేళలో ఎదురెదురుగా వచ్చే వాహనాల ప్లడ్‌లైట్‌ల వలన రహదారి సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని సూచించారు. వాహన వేగం పరిమితి నియంత్రించాలని, సీట్‌బెల్టు పెట్టుకునేలా చూడాలని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలకు ముందుర భాగంలో బంపర్లు ఏర్పాటు చేయడం వలన ఎయిర్ బ్యాగులు త్వరగా తెరుచుకోవని వీటిపట్ల కూడా అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకునేలా, తమ వాహనాలకు ఇరువైపులా అద్దాలు ఉండేలా వారిలో అవగాహన కలిగించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదు నిమిషాలలో 108 వాహనం వచ్చేలా చూడాలని, రక్తనిధి అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా అడ్వాన్స్ లైఫ్‌సేవింగ్ అంబులెన్స్ కొరకు వైద్య శాఖ సంచాలకులకు లేఖ రాయాల్సిందిగా కలెక్టర్ జిల్లా వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో మెదక్, తూప్రాన్ డిఎస్‌పిలు కృష్ణమూర్తి, కిరణ్‌కుమార్, ఆర్‌టిఏ అధికారి శ్రీనివాస్‌గౌడ్, అబ్కారీ శాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి, డియంఅండ్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్రరెడ్డి, తూప్రాన్, నర్సాపూర్ జాతీయ రహదారుల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement