Thursday, November 28, 2024

Medak – డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి..

ఆరు నెలలుగా ప్రేమ పేరిట వేధింపులు
తిరస్కరించడంతో కత్తితో దాడి
విషమంగా విద్యార్థిని పరిస్థితి
గాంధీ ఆసుపత్రికి తరలింపు
పరారీలో దాడికి పాల్పడిన యువకుడు
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఘటన


మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ – ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. గత ఆరు నెలలుగా ప్రేమ పేరిట వేదింపులకు గురి చేస్తుండగా, విద్యార్థిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ భయానక ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

స్థానికులు, బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం అవుసులపల్లికి చెందిన దివ్య కృప సోమవారం ఉదయం 8 గంటలకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఈ క్రమంలో చైతన్య అనే యువకుడు కత్తితో దాడి చేయగా, విద్యార్థిని ప్రతిఘటించింది. దీంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే గత ఆరు నెలలుగా చైతన్య ప్రేమ పేరుతో వెంటబడుతున్నట్లు బాధిత విద్యార్థిని పోలీసులకు వాగ్మూలం ఇచ్చింది. కాగా, దాడికి పాల్పడిన యువకుడు పరారీలో ఉన్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement