మెదక్ – కెసీఆర్ పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని , ఆయన వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లే ఆ కుర్చీ వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు.పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని, అక్కడ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు.
ఆరు నెలలు ఆగితే ఇక్కడ స్థానిక ఎన్నికలు వస్తాయని, రాష్ట్ర ప్రజలు పట్టుబట్టి బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారని అన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని, తెలంగాణ బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుందని, నాణ్యత లేని విద్యుత్ వల్ల చాలా ప్రాంతాల్లో మోటార్లు కాలిపోతున్నట్టు చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ లు కూడా కాలిపోతున్నాయని అన్నారు. కేసీఆర్ వచ్చాక 24 గంటలు కరెంట్ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు పెరిగాయని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పి నేడు అసహనంతో ఉన్నారని అన్నారు. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తున్నారన్నారు. దాడులు చేయిస్తూ… కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము కేసులు పెట్టివుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారు అని హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. రుణ మాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రైతు బంధు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు