న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోర్టు కేసులు భారంతో సతమతమవుతున్న న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తెలంగాణా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో తెలంగాణా రాష్ట్రం తరఫున ఆయన పాల్గొన్నారు. ఉదయం గం. 10.00 సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. ప్రధానమంత్రితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బగేల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యు.యు.లలిత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, సలహాదారులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు.
ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల మధ్య న్యాయవ్యవస్థ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. సదస్సు అనంతరం మంత్రి ఇంద్రకణ్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచేందుకు కృషి చేసిన ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టులో గతంలో 12 మంది న్యాయమూర్తులుండగా కొత్తగా 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టడం ద్వారా జస్టిస్ రమణ కేసుల సత్వర పరిష్కారానికి మార్గం చూపారని కొనియాడారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్‌డేట్ కావడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి జస్టిస్ రమణ క్రియాశీలక చొరవ తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతులు, స్థలం, నిధుల తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, దీనిద్వారా ప్రముఖ సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం అస్కారం ఏర్పడిందని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో పనిభారం తగ్గించేందుకు కొత్తగా 47 కోర్టులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వివిధ కేటగిరీల్లో 2,542 పోస్టులను మంజూరు చేసిందని తెలిపారు. కొత్త కోర్టుల ఏర్పాటుపై హైకోర్టు సిఫారసులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. దేశంలో న్యాయస్థానాల నిర్వహణ సజావుగా సాగేందుకు, న్యాయ వ్యవస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
పేదలు, బలహీనవర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, న్యాయపరమైన అవగాహన శిబిరాల నిర్వహణ, లోక్ ఆదాలత్‌లను నిర్వహించేందుకు రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తన సహాయ సహకారాలను అందిస్తోందని, అవసరమైన బడ్జెట్‌ను సమకూరుస్తోందని ప్రకటన ద్వారా వివరించారు. ఈ కోర్టుల ఫేజ్ 3 కోసం హైకోర్టు ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ను సమకూరుస్తోందని చెప్పారు. సదస్సు అనంతరం తన పర్యటన ముగించుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.
తెలంగాణా సీఎస్‌పై ఎన్వీ రమణ అసహనం
ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌పై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాను ఆయా అంశాలను పరిశీలిస్తానని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. తామేమీ వ్యక్తిగత పనుల గురించి మాట్లాడడం లేదని, దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులలో ఒక న్యాయవాది కోర్టు హాల్‌లోకి వెళ్లి వెనక్కి వస్తే తప్ప మరొకరు అడుగు పెట్టే పరిస్థితి లేదని ఆయన వాపోయారు.