Friday, November 22, 2024

Mbnr:వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుకుందాం… ఎమ్మెల్యే యెన్నం


మహబూబ్ నగర్, అక్టోబర్ 10 (ప్రభ న్యూస్) : రాజకీయాలకు అతీతంగా ఈ సారి దసరా పండుగ ఉత్సవాలు జరుపుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ & బి అతిథి గృహంలో గురువారం నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలకు ఓ ప్రత్యేకత సంతరించుకుందని, ఎన్నో సంవత్సరాలుగా జిల్లా పరిషత్ మైదానంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేవారమని, ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడం జరిగేదని తెలిపారు.

జిల్లా పరిషత్ మైదానంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి పార్కింగ్ ఏరియా కావడమే కాకుండా అక్కడ నిర్మాణపు పనులు జరుగుతున్న సందర్భంగా గత సంవత్సరం నుంచి ఈ వేడుకలు జిల్లా పరిషత్ మైదానంలో జరపడం లేదని ఆయన చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట లాంటివి జరుగకుండా, విశాలమైన ప్రాంగణంలో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని దసరా ఉత్సవ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఈ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, మున్సిపాలిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఘనంగా దసరా ఉత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు.

అతిథులు ఎవరు కూడా వేదిక మీద రాజకీయ ప్రసంగాలు చేయకుండా సూచించాలని ఆయన కోరారు. అందరూ సమన్వయంతో ఉత్సవాలు వైభవంగా జరిగేందుకు సహకరించాలని, ధార్మిక కార్యక్రమాల్లో ఏ వ్యక్తి, ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ దసరా ఉత్సవాలు కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులతో దసరా ఉత్సవాలు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, బురుజు సుధాకర్ రెడ్డి, డాక్టర్ మురళీధర్ రావు, చంద్రయ్య ,కె.ఎస్ రవికుమార్, అంజయ్య, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, మోహన్ యాదవ్, మాల్యాద్రి రెడ్డి, లక్ష్మికాంత్ సారంగి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement