– ఉమ్మడి మెదక్, (ప్రభ న్యూస్ బ్యూరో)
మైనంపల్లి హాట్ హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. నిన్నటి నుంచి రాష్ట్రంలో అంతటా ఇదే చర్చ జరుగుతోంది. ఈ విషమ్మీద కాస్త నెమ్మదించాలని, సంయమనం పాటించి పార్టీతో కలిసి నడవాలని మైనంపల్లికి మంత్రి సబితారెడ్డి వంటి సన్నిహితులు హితబోధ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవ్వాల (మంగళవారం) తిరుమలలో కాస్త తగ్గి మాట్లాడినట్టు సమాచారం. తాను సీఎం కేసీఆర్‌ను ఏమీ అనలేదని, తనను సీఎం కూడా ఏమీ అనలేదని వ్యాఖ్యానించడం వెనకాల పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది.
మెదక్ నియోజకవర్గంలో 25 కోట్ల మేర ఖర్చు..
ఇక.. తనకు, తన కుమారుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంగా ఆమ్ఆద్మీ పార్టీ నుంచి తెలంగాణలో పెద్ద ఎత్తున పోటీచేయాలని భావించినట్టు సమాచారం అదుంతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో రోహిత్ సేవా కార్యక్రమాల పేరిట దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసినట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది. పాఠశాలలకు నిధులు ఇవ్వడం.. దెబ్బతిన్న స్కూళ్లకు పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చి రిపేర్లు చేయించడం వంటివి చేయడమే కాకుండా, యువతీ, యువకులను ఆకట్టుకునేలా పలు సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తోంది. అందుకనే తనకు మెదక్‌లో పట్టు ఉందని, తన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాతు ఉన్నట్టు సమాచారం.
మైనంపల్లి రోహిత్‌కు టికెట్ కేటాయించకపోవడంతో..
బీఆర్ ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి తనయుడికి మెదక్ నుండి టికెట్ కేటాయించని సంగతి తెలిసిందే. అయితే బి ఆర్ ఎస్ పార్టీ పెద్దల హామీ మేరకు హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ మెదక్ నుండి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తనకు టికెట్ వస్తుందనే రోహిత్ మెదక్ నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల మేర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టగా తీరా అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో మైనంపల్లి ఒక్కింత అసహనానికి గురై నిన్న(సోమవారం) తిరుమలలో మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు ఎక్కుపెట్టారు.
దీనికంతటికీ హరీష్ రావు కారణమని మైనంపల్లి స్పష్టం చేశారు. పనిలో పనిగా మంత్రి హరీశ్ రావు పై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మైనంపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలతో చర్చ జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే సూట్ అవుతుందని పలువురు రాజకీయ పరిశీలకులు మైనంపల్లి కి సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 50 సీట్లు కేటాయిస్తే తాను (హన్మంతరావు) తన తనయుడు (రోహిత్) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతామని స్పష్టం చేసినట్టు సమాచారం అందుతోంది.
మరోవైపు మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హరీశ్ అనుచరులు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లి వెంటనే హరీశ్ రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.