Sunday, November 3, 2024

Transfers: యాదాద్రి, వేముల‌వాడ‌ల‌లో భారీగా బ‌దిలీలు..

15 ఏళ్ల త‌ర్వాత సిబ్బందికి స్థాన చ‌ల‌నం ..
54 మంది ఉద్యోగుల‌కు ట్రాన్స్ ఫ‌ర్స్
ఆంధ్రప్రభ స్మార్ట్- యాదాద్రి/వేముల‌వాడ : తెలంగాణ దేవదాయ ధ‌ర్మ‌దాయ శాఖ ఆల‌యాల‌లోని ఉద్యోగుల బ‌దిలీల‌కు శ్రీకారం చుట్టింది.. గ‌త 15 ఏళ్లుగా ట్రాన్స్ ఫ‌ర్స్ లేకుండా పనిచేస్తున్న సిబ్బందికి షాక్ ఇచ్చింది.. ప్ర‌ముఖ దేవాల‌యాలు యాదాద్రి, వేముల‌వాడ‌లో విధులు నిర్వ‌హిస్తున్న 54మంది సిబ్బందిపై బ‌దిలీ వేటు వేసింది.. ఈ మేరకు ఆ శాఖ క‌మిష‌న‌ర్ హనుమంతరావు జారీ చేశారు.

యాదాద్రిలో..
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో 26మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఈవోలు, ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక సివిల్ ఇంజినీర్ డీఈ, ఒక ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు.

- Advertisement -

చివరి సారిగా 2009లో బదిలీలు..
యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటి వరకు బదిలీలు జరగలేదు. చాలా మంది అధికారులకు, పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి.

వేముల‌వాడ‌లో …
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇద్దరు ఏఈవోలతో పాటు ఏడుగురు పర్యవేక్షకులు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక డిప్యూటీ ఈ.ఈ తో మొత్తం 28 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడి ఉద్యోగులు ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలైన యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, కొమురవెల్లి, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు ఉద్యోగుల బదిలీలు జరిగినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా బదిలీ అయిన ఉద్యోగులు మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement