మార్కెట్లలో పత్తి ధర ఢమాల్
సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్
పత్తి బస్తాలతో తరలివచ్చిన రైతులు
క్వింటా పత్తి ₹6200 దాటడం లేదు
ఒకేరోజు 200 ధర తగ్గడంతో ఆందోళన
అధికారులు, వ్యాపారులు కుమ్మక్కు అయ్యారని ఆరోపణ
ఆంధ్రప్రభ స్మార్ట్, వరంగల్: వరంగల్, ఖమ్మం పత్తి మార్కెట్లకు సోమవారం పెద్ద ఎత్తున పత్తి బస్తాలు వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో మార్కెట్లకు పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతో పాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్దమొత్తంలో పత్తి బస్తాలు తీసుకొచ్చారు. అయితే.. పత్తి ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు ధర ₹6200 దాటడం లేదని అంటున్నారు. మార్కెట్ అధికారులు వ్యాపారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాములలోనూ అంతే..
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్కు పత్తి భారీగా వచ్చింది. అయితే.. బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు మాత్రం రోజురోజుకు తగ్గుతున్నాయి. శుక్రవారం నాటికంటే ₹200 ధర తగ్గిందని రైతులు చెబుతున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు బాగా పరిగాయని, తేమ శాతం పేరుతో ధర తక్కువగా ఇస్తుండటంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మార్కెట్ అనే పేరే తప్ప తమకేమీ లాభం లేదని చెప్పారు. వర్షాల వల్ల ఈ సారి పత్తి దిగుబడి తగ్గిందని వెల్లడించారు.