నెక్లెస్ రోడ్ లో ఉత్సాహంగా మారధాన్
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అత్యవసర వైద్యానికి కీలక స్థానం
హైదరాబాద్ : వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే పురస్కరించుకుని సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమీ), తెలంగాణ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో మారథాన్ నిర్వహించారు. సంజీవయ్య పార్కు సమీపంలో థ్రిల్ సిటీ వద్ద రన్‌ను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారధాన్ 5కె, 10కె తో పాటు 10 కె సైకిలో ధాన్ ను కూడా నిర్వహించించిది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో ఈ సొసైటీ ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. అత్యవసర వైద్యం తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, క్లిష్టమైన సమయాల్లో అత్యంత నైపుణ్యం, అంకితభావం కలిగిన అత్యవసర వైద్యులు చాలా అవసరం అన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా వైద్య సేవల్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుండడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సెమీ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘జీవితాన్ని కాపాడడంలో ప్రతి సెకను ముఖ్యం’ అని, ఇది ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికే కాకుండా సాధారణ పౌరులందరికీ వర్తిస్తుందని అన్నారు. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందించడం, కార్డియాక్ అరెస్ట్‌లో ఉన్న వారికి ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించడం వారిని సమీప ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేయడం ప్రతి పౌరుడి విధిగా ఆయన పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా తమ 25వ వార్షికోత్సవాన్ని కూడా ఇదే రోజు జరపుకోవడం అనందంగా ఉందన్నారు. సెమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరవణ కుమార్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ మెడిసిన్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ఈ మారధాన్ లో 1000 మందికి పైగా పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. సెమి ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ వర్మ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఇన్ ఫ్రా యం.డి శ్రీనివాస్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ రన్ర్స్ క్లబ్, ఇ.సి.ఐఎ.ఎల్ రన్నర్స్ క్లబ్ తో పాటు సెమీ నేషనల్ గవర్నెన్స్ చైర పర్సన్ డాక్టర్ ఇమ్రాన్, కోశాధికారి సౌజన్య, సెమీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, ఆర్గనైజింగ్ కో ఆర్టినేటర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.