- ప్రొఫెసర్ మృతికి సంతాపం ప్రకటించిన మావోయిస్టులు
- అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ
ఆంధ్రప్రభ స్మార్ట్, వాజేడు (ములుగు జిల్లా) : ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొఫెసర్ సాయిబాబా ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ప్రజాస్వామ్యవాదులు కొనసాగించాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ పేర్కొంది. ఈ మేరకు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. సాయిబాబా మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి…
పౌర హక్కులను పరిరక్షించడానికి ప్రజల తరఫున గొంతెత్తిన సాయిబాబాను హిందుత్వ, ఫాసిస్టు రాజ్యమే హత్య చేసిందన్నారు. ఢిల్లీ ప్రొఫెసర్ గా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేశారు. 1997 డిసెంబర్ లో ఏఐపీఆర్ఎఫ్ ప్రజాస్వామిక తెలంగాణ కోసం రెండు రోజుల సదస్సు జరిగిందన్నారు. ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ జరిగిందని, ఆ సదస్సుకు సాయిబాబా నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు…
ఆల్ ఇండియా పీపుల్స్ రిజిస్ట్రేషన్ ఫారం ఏఐపిఆర్ఎఫ్ లో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సాయిబాబా పోరాడారన్నారు. ఫోరం ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యవాదుల కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి.. ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సల్వాజుడుం పేరుతో కొనసాగుతున్న వైశాచిక దాడులను ఖండించారని పేర్కొన్నారు.
మావోయిస్టులతో సంబంధాలు అంటగట్టారు..
సాఫ్ట్ వేర్ ద్వారా సాయిబాబా కంప్యూటర్ లో చొరబడి మావోయిస్టుల సాహిత్యాన్ని చొప్పించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు అంటగట్టారని పేర్కొన్నారు. 90 శాతం అంగవైకల్యంతో కదలలేని స్థితిలో వీల్ చైర్ లో ఒకరి మద్దతు లేకుండా తనపని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న సాయిబాబాను అన్యాయంగా పది సంవత్సరాలు జైలులో నిర్బంధించారన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు జైల్లోనే ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారని తెలిపారు. మరణానికి బ్రాహ్మణీయత హిందుత్వ ఫాసిస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.