Friday, November 22, 2024

TS: కొంగాల ఘటనపై మావోయిస్టుల లేఖ విడుదల…

ఏసు కుటుంబానికి సానుభూతి తెలిపిన మావోయిస్టులు
వాజేడు, జూన్ 6 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనపై వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట సోషల్ మీడియా వేదికగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

‘‘3వ తేదీన కొంగాల అడవుల్లో కర్రెగుట్టపై వేట్ కోసం వెళ్ళి బూబీట్రాప్ ని తొక్కడంతో అది పేలి జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు మరణించాడు. అతని కొడుకు స్వల్పంగా గాయపడ్డాడు. అందుకు మేము చింతిస్తున్నాం… ఈ ఘటనలో చనిపోయిన ఇల్లెందుల ఏసు కుటుంబానికి మా పార్టీ తరఫున సానుబూతి తెలియపరుస్తున్నాం. సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ ప్రయోజనాలకు అడవులను కట్టపెట్టడానికి స్థానిక ప్రజలకు అడవులపై ఎలాంటి హక్కులు లేకుండా చేసి ఆదివాసులను అడవుల నుండి తరిమి వేయాలనే పథకం రూపొందించారు. కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై, ప్రజలపై దాడులు చేస్తూ నరసంహారం కొనసాగిస్తూ… ప్రజల్లో భయంకర పరిస్థితులు కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే వాజేడు- వెంకటాపురం ఏరియాలో కూడా మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో దాడులు కోనసాగుతున్నాయి.

- Advertisement -

మా దళాల సమాచారం కోసం కొంతమంది లంపెన్ సెక్షన్ ను స్వల్ప ఆర్థిక ప్రయోజనాలతో ప్రలోభ పెట్టి ఇన్ ఫార్మర్ గా మార్చుకుంటున్నారు. వేటగాళ్ల వేషంలో ఇన్ ఫార్మర్లకు సెల్ పోన్ లు ఇచ్చి అడవుల్లోకి పంపుతున్నారు. మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్ గఢ్ పోలీసులు కలిసి నిరంతరం కూంబింగ్ లు చేపడుతున్నారు. మార్చి 6వ తేదీన వేటగాళ్ల రూపంలో అడవుల్లోకి వచ్చిన ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు పిట్టపడా అడవుల్లో మా దళంపై దాడి చేశారు. ఈ దాడిలో మా సహచర కామ్రేడ్స్ సంతోష్ (సాగర్)తో పాటు, మనీరామ్, లక్ష్మణ్ లు అమరులయ్యారు. ఈ ఘటన తరువాత మరింత కూంబింగ్ ను పెంచి అడవులను జల్లెడ పడుతూనే ఉన్నారు. మా ఆత్మరక్షణ కోసం ప్రజలు నిత్యం పనులు చేసుకునే స్థలాల్లో కాకుండా ప్రజలు తిరగని ఎత్తయిన కొండలపై అనేక ట్రాపులను ఏర్పాటు చేశాము. ఈ విషయం పరిసర ప్రొంతాల్లో ఉన్న ప్రజలందరికీ అడవుల్లోకి రాకూడదని తెలియజేశాము. దానితో ప్రజలెవరూ అడవుల్లోకి వెళ్లడం లేదు. కానీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీ దళాల సమాచార సేకరణతో పాటు, పోలీసులు కూంబింగ్ కు వెళ్లేదారులను క్లియర్ చేయడానికి వేట పేరుతో కొద్దిమంది అమాయక ప్రజలను అడవుల్లోకి పంపి తమ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. ఇల్లందుల ఏసును పోలీసులే మా సమాచారం కోసం పంపారు. అతను మరణించిన తరువాత ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులే ఎలాంటి బాధ్యత వహించకుండా మావోయిస్టు పార్టీపై తోసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఘటనకు పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. ఈ ఘటనను సాకుగా చూపి మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబాలను, కొద్ది మంది పనీ పాట లేని అంపెన్ సెక్షన్ యువకులను కూడగట్టి వారి ద్వారా ధర్నాలు చేయిస్తున్నారు. పోలీసులు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకించమని ఇల్లెందుల ఏసు కుటుంబానికి ప్రజలకు పిలుపునిస్తున్నాం.. ప్రజలారా కేంద్ర, రాష్ట్ర దోపిడీ ప్రభుత్వాలు ప్రధానంగా బ్రాహ్మణీయ హిందుత్వం ఫాసిస్టు పాలకులు ఇక్కడి అడవులను, ఖనిజ సంపదను, సామ్రాజ్యవాదులకు, కార్పోరేట్లకు కట్టబెడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ ప్రజా వ్యతిరేక అభివృద్ధి నిరోధక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ప్రజలపై మావోయిస్టు పార్టీపై విప్లవ ప్రతిఘాతుక వ్యూహాత్మక కాగార్ పేరుతో నిర్ణయాత్మక దాడిని కొనసాగిస్తున్నారు. ఈ ఐదు నెలల కాలంలో కగార్ పేరుతో పదుల సంఖ్యలో సాధారణ ప్రజలను చంపి నరసంహారం సృష్టించారు. దీనితో అనివార్యంగా ప్రజలను యుద్ధంలోకి దింపుతున్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు నేడు అభివృద్ధి నిరోధకులు బ్రాహ్మణీయ హిందుత్వవాదులు కొనసాగిస్తున్న క్రూరమైన కగార్ దాడికి వ్యతిరేకంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ దాడిని ఓడించడం ప్రజలందరి బాధ్యత కూడా పోరాడమని పిలుపునిస్తున్నాం’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement