పెద్దపల్లి, ఆగస్టు 8 (ప్రభన్యూస్): పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం గ్రామంలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటేశ్ పేరిట విడుదల చేసిన లేఖలో కునారం భూములకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు. కునారంలో గ్రామంలో 1200 ఎకరాల పోరంబోకు భూములు ఉండగా, దాదాపు 600 ఎకరాల భూములను పేద, మధ్య తరగతి ప్రజలు చాలా కాలం నుంచి ఎకరం, రెండెకరాలు దున్నుకుంటున్నారని వివరించారు. ఆ భూములను వాళ్లే దున్నుకోవాలని స్పష్టం చేశారు. అలాగే మిగతా 600 ఎకరాల భూములను భూ స్వాములైన దండ నర్సింహరెడ్డి 200 ఎకరాలు, గీట్ల రాజేందర్ రెడ్డి 60 ఎకరాలు, గీట్ల నిర్మల 60 ఎకరాలు, గొర్ల సుదర్శన్ 30 ఎకరాలు, మిగిలిన భూములను పలుకుబడి ఉన్న పెద్దలు ఆక్రమించినట్లు ఆరోపించారు.
ఈ భూములను ఎల్. రాజయ్యకు 30 ఎకరాలు, శ్రీనివాస్‌కు 30 ఎకరాలు అమ్మారన్నారు. సదరు భూములను 200 మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ఈ భూములను పేదలకు ఇప్పిస్తామని చెప్పి ముఖం చాటేసి భూస్వాముల పక్షానే నిలిచారని ఆరోపించారు. భూములను ఆక్రమించిన భూస్వాములు, పెత్తందార్లు ఆ భూములను సాగు చేయడం నిలిపివేయాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోరాడి ఆక్రమించిన భూములకు పట్టాలు చెయిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిచో ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదన్నారు
. అలాగే పెద్దపల్లి మాజీ విలేకరి కట్టా నరేంద్రచారి, కంది చొక్కారెడ్డిలు పెద్దపల్లి పట్టణం, దాని చుట్టు పక్కల ఉన్న వివాదస్పద భూములను అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో కొనుగోలు చేసినట్టు దొంగ పట్టాలు చేయించి, అమాయక ప్రజలకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వ్యక్తి భూమిని కొనుగోలు చేశానని నమ్మించి ప్లాట్లుగా మార్చి అమ్మారని, తీరా ఆ భూమిలో ఇల్లు కట్టుకుందామని పోగానే, పట్టాదారు వచ్చి ఈ భూములు మావేనని చెప్పడంతో కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే బొంపల్లి, కాసులపల్లి, గౌరెడ్డిపేటలలో ఉన్న దేవాదాయ భూములను సైతం దొంగ పట్టా చేసుకొని ఆక్రమిస్తూ అక్రమంగా అమ్ముకుంటున్నారన్నారు. ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి అమ్ముతూ మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు కొనుగోలు చేసిన భూములకు తిరిగి డబ్బులు చెల్లించాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని మావోయిస్టు నేత వెంకటేశ్ హెచ్చరించారు.