ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న దబ్బకుంట పోలీస్ క్యాంప్ పై సోమవారం సాయంత్రం మావోయిస్టులు అండర్ బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్ లతో ఈ దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య కొంత సేపు బీకర పోరు జరిగింది. ఈ దాడి నుంచి పోలీసులు తృటిలో తప్పించుకున్నారు.
ఇక.. పోలీసుల దాడిలో మావోయిస్టులు ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. దాడి జరిగిన దబ్బకుంట పోలీస్ క్యాంపు తెలంగాణ లోని దుమ్ముగూడెం ప్రాంతానికి తూర్పు దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లోని కుంట ప్రాంతానికి ఉత్తర దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టుల మెరుపుదాడితో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని చిన్నాపురం పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు ఇదే తరహా దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.