దుమ్ముగూడెం, ప్రభన్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు పంజా విసిరారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన చింతకుప్ప వారధి పనులు జరుగుతున్న సమయంలో బ్రిడ్జి కింది భాగంలో మట్టిని తొలగించే పనులు చేపడుతున్న ప్రాంతానికి సుమారు 150మందికి పైగా మావోయిస్టులు వచ్చి ఘాతుకం సృష్టించారు. అక్కడ పనులు చేపడుతున్న నాలుగు ట్రాక్టర్‌లను, ఒక మిక్చర్ ట్యాంకర్‌ను, మరో జేసిబిని దహనం చేసి గ్రామానికి చెందిన ముగ్గురి ట్రాక్టర్‌లను మావోలు వారి వెంట తీసుకెళ్ళారు. దుమ్ముగూడెం మండలంలో స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పంజా విసిరి చేసిన ఈ సంఘటనతో ఏజన్సీ హైఎలర్ట్ అయింది. మండలంలోని చింతకుప్ప వారధి నిర్మాణం సుమారు రూ.4కోట్ల వ్యయంతో జరుగుతోంది.
ఈ పనులు దాదాపు చివరి దశకు రాగా బ్రిడ్జి పిల్లర్‌ల భాగంలో నింపిన మట్టిని తొలగించేందుకు స్థానికులు ట్రాక్టర్‌ల ద్వారా మట్టిని తోలే పనులు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.2.00ల సమయంలో సుమారు 150మంది మిలీషియా సభ్యులతో కలిసి మావోయిస్టులు ఆ ప్రాంతానికి వచ్చారు. బ్రిడ్జి నిర్మాణ పనులు మంగళవారం చేపట్టకపోవడంతో కేవలం ట్రాక్టర్ నడిపే వారి వద్దకు వె ళ్ళారు. ముందుగా అక్కడున్న వారి సెల్‌ఫోన్‌లను మావోలు లాక్కున్నారు. సుమారు పది మంది ఫోన్‌ల వరకు తీసుకున్న మావోయిస్టులు అన ంతరం అక్కడే డీజిల్ డ్రమ్ముల్లో ఉన్న డీజిల్‌ను తీసి వాహనాలకు నిప్పంటించారు. స్థానిక సర్పంచ్ కట్టం కృష్ణ, పాయం రమేష్ అనే వ్యక్తులకు చెందిన ట్రాక్టర్‌లపై డీజిల్ పోసి తగులబెట్టారు. సమీపంలో కాంట్రాక్టర్‌కు చెందిన ఓ ట్రాక్టర్‌కు నిప్పంటించారు. బ్రిడ్జి అవతలి భాగంలో ఉన్న మిక్చర్ వాహనానికి, ప్రొక్లెయినర్‌కు నిప్పంటించినప్పటికీ అవి పాక్షికంగా కాలాయి.