తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
కేసీఆర్ సంతాపం…
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బండారు దత్తాత్రేయ సంతాపం…
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, యువజన నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, యువజన నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణ వార్త తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
యువకుడు, జాతీయ భావాలున్న నాయకుడు, సమాజ సేవకు అంకిత భావంతో పనిచేసిన జిట్టా బాలకృష్ణ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని, యువతకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించి, యువకులను సంఘటిత పరిచేందుకు దోహదపడ్డారని, స్వామి వివేకానంద విగ్రహావిష్కరణతో బాటు యువజన సంఘాల అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు నిర్వహించి తనను ఆహ్వానించేవాడని వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు.