మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న భూఉష్ణ (భూఉష్ణ) క్షేత్రాన్ని అన్వేషించడం, అభివృద్ధి చేయడం కోసం సింగరేణి కాలరీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC), తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (తెలంగాణ రెడ్‌కో) మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. శుక్రవారం సాయంత్రం సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్, ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఎక్స్ ప్లోరేషన్) సుష్మా రావత్, తెలంగాణ రెడ్‌కో జీఎం సత్య వరప్రసాద్‌లు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. మణుగూరులో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించిందన్నారు. సింగరేణి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దిశగా ముందుకు వెళ్తోందని తెలిపారు. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాయని తెలిపారు.
ఇందులో భాగంగానే మణుగూరులో జియో థర్మల్ క్షేత్ర అన్వేషణ లో ఓ ఎన్ జీ సీ, తెలంగాణ రెడ్కోతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. 2070 నాటికి సంపూర్ణ కార్బన్ ఉద్గార రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలని దేశం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇలాంటి పర్యావరణహిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఓఎన్జీసీ, సింగరేణి, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఈ కీలక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చు కు న్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్) ఎన్‌వికె శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి.వెంకటేశ్వర్ రెడ్డి, జీఎం(ఆర్ అండ్ డీ) ఎస్ డి ఎం సుభానీ, జీఎం(కోఆర్డినేషన్) జీ.దేవేందర్, ఓఎన్జీసీ తరఫున సంస్థ జీజీఎం గోపాల్ జోషి, జీఎం సంజయ్ కుమార్ ముఖర్జీ, చీఫ్ మేనేజర్ రమేష్ సట్ల, అనుప్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.