ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన గొప్ప మహనీయులు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా, విలక్షణ పార్లమెంటేరియన్ గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్టించిన ఆయన సామాన్య జీవితం గడిపారన్నారు.
మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారన్నారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. వారు మరణించటం దేశానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.