మంగపేట, జూలై 21 ( ప్రభ న్యూస్ ) : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ పంచాయతి పరిధిలోని శనిగకుంట గ్రామ సమీపంలోని కూడలి ఒర్రె ఆదివారం ఉప్పొంగింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో శనిగకుంట సమీపంలోని కూడలి ఒర్రె లో లెవెల్ కాజ్ వే పై నుండి వరద నీరు ఆదివారం ఉదయం నుండి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో శనిగకుంట గ్రామానికి బాహ్య ప్రపంచానితో సంబంధాలు తెగిపోయాయి.
శనిగకుంట గ్రామంలో మొత్తం 144 ఇండ్లు ఉండగా ప్రస్తుతం సుమారు 20 ఇండ్లలో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరాలతో బాధ పడుతున్నారు. వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళాలన్న కూడలి ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దారి లేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని శనిగకుంట గ్రామస్తులు కోరుతున్నారు.