Tuesday, November 26, 2024

Mandamarri – గోల్మాల్ గోవిందల్ని తరిమికొట్టండి – సీఎం కేసీఆర్ పిలుపు

ప్రభాన్యూస్, చెన్నూర్ (మంచిర్యాల జిల్లా) – ఎన్నికలొస్తే నలుగురైదుగురు సూట్కేసు బాబులొస్తారు, వీళ్ల బాగోతం అంతా ఇంత కాదు. వీళ్లకు ఎలక్షన్లోనే జనం గుర్తుకొస్తారు. ప్రేమ ఒలకబోస్తారు. తాగటానికి రెండు సీసాలు ఇస్తారు. వీళ్లల్లో ఒకయాన పేకాట క్లబ్ నడుపుతాడు. మంచిర్యాలలో పోటీ చేస్తున్నాడు. ఇలాంటి గోల్మాల్ గోవింద గాళ్లను తరిమి కొట్టక పోతే, ఆ దరిద్ర్యాన్ని వదులుకోలేం, ఒక్కసారి ఆలోచించండి, తమాషా కోసం ఓటు వేసి ఆగమాగం కావద్దు, అని తెలంగాణ సీఎం కె.చంద్ర శేఖర్ రావు ప్రజలకు పిలుపు ఇచ్చారు. చెన్నూరు నియెజకవర్గం మందమర్రిలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభకు జనం పోట్టెత్తారు. కేసీఆర్ ప్రసంగానికి కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటు సరఫరా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రసానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు ఈ దొంగలొచ్చి కరెంటు తగ్గిస్తాం, రైతు బంధు తీసేస్తామంటున్నారు.

ఇలాంటి రైతు వ్యతిరేక పార్టీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని కేసీఆర్ పిలుపును ఇచ్చారు. ఇలాంటి పార్టీలను తరిమికొట్టాలనే ఆలోచన లేక పోతే పెద్ద ప్రమాదం తప్పదన్నారు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పెద్ద పొలికేక అన్నారు. యుగయుగాలుగా దళితులు నిర్లక్ష్యానికి గురయ్యారని, 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళితుల్ని అమ్మ, బొమ్మ ముఖం చూపించి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చిందన్నారు. దళితులంటే కాంగ్రెస్ పార్టీకి పెదాలపైనే ప్రేమ చూపించిందని, రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్నూ ఎన్నికల్లో ఓడించిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు, స్ఫూర్తిని రగిల్చేందుకు బీఆర్ఎస్ నడుము కట్టిందని, హైదరాబాద్లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అధికారుల్లో రాజ్యాంగ విలువల సోయ ఉండాలనే తెలంగాణ సెక్రటరియేట్కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టామన్నారు.

ఇక సూట్కేసులతో వచ్చే నాయకులు కావాలా? జేబులో పైసా లేకున్నా ప్రజల కోసం పని చేసే బాల్కన్ సుమన్ కావాల్నా అని కేసీఆర్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎంతో శ్రమించాడని, రూ.1650 కోట్లతో అభివృద్ధి పనులు సాధించాడని కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో పలు సమస్యల్ని పరిష్కరించాలని తనను కోరాడని, సుమన్ను 60 వేల మెజారిటీతో గెలిపించిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement