తహసీల్దార్ బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వార్డు కౌన్సిలర్, తహసీల్దార్తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ విజయ్ అనే యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వేకువజామున ఫేస్ బుక్‌లో లైవ్‌పెట్టి పురుగుల మందు తాగాడు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొడ్రాల విజయ్(30) కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. సొంతిల్లు లేని విజయ్ జిల్లాలోని గుమ్ముడూర్లోని నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అధికారులు మాత్రం ఇల్లు కేటాయించలేదు. తహసీల్దార్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. ఇల్లు ఉన్నోళ్లు, డబ్బులున్నోళ్లకే ఇళ్లు కేటాయిస్తున్నారని, తహసీల్దార్ రంజిత్‌కుమార్, వార్డు కౌన్సిలర్ జనార్దన్, మరికొందరితో కలిసి ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడుతున్నారని ఐదు రోజుల క్రితం విజయ్ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు. సదురు పోస్టును తొలగించకపోతే చంపేస్తామంటూ బాధితుడు విజయ్ ని తహసీల్దార్ రంజిత్ కుమార్, కౌన్సిలర్ జనార్దన్ ఫోన్ చేసి బెదిరించారు. దాంతో విజయ్ మంగళవారం వేకువజామున ఫేస్బుక్ లైవ్‌పెట్టి… పురుగుల మందు తాగి చనిపోతున్నానని విజయ్ చెప్పాడు. తహసీల్దార్, వార్డు కౌన్సిలర్తన చావుకు కారణమని అందులో తెలిపాడు. విషయం తెలుసుకున్న విజయ్ స్నేహితులు అతని వద్దకు వెళ్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.