ఆంధ్రప్రభ, మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని హేమాచల క్షేత్రంలో(మల్లూరు గుట్ట) పెళ్లి సందడి నెలకొంది. లక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదో రోజు ఆలయ ఇన్చార్జి ఈవో శెనిగల మహేశ్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు సంబురంగా జరిగాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందంతో పాటు మల్లూరు ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తలంబ్రాలకోసం ఎగబడ్డ భక్తులు..
లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో లక్ష్మీనృసింహస్వామికి పాణిగ్రహణం (జీలకర్ర బెల్లం) నిర్వహించారు. అనంతరం మాంగల్య ధారణ, ముత్యాల తలంబ్రాల కార్యక్రమం జరిగింది. స్వామి వారి తలంబ్రాల కోసం భక్తులు ఎగబడ్డారు.