ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర అని, ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచిందని, తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారని, శ్రీనిధి వంటి కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నాయన్నారు.