- ముప్పై ఏళ్ల కల నెరవేతున్న వేళ
- రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు
- 20న ప్రారంభించనున్న సీఎం రేవంత్
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారికి ప్రయోజనం
- సంతోషం వ్యక్తం చేస్తున్న నేతన్నలు
ఆంధ్రప్రభ స్మార్ట్, సిరిసిల్ల ప్రతినిధి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేనేతకారులకు మహర్దశ పట్టనుంది. వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిరిసిల్ల, గర్షకుర్తి, చొప్పదండి, చామన్ పల్లి, వేములవాడ నేతన్నలకు నూలు సమస్య తీరనుంది. చేతినిండా పనిదొరికే అవకాశం కలుగుతుంది. ముప్పై ఏళ్ల కల నెరవేరుతుందని పలువురు నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన వేములవాడలో నూలు డిపోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నూలు డిపోతో నేతన్నలకు పని భద్రత…
దేశంలోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. సిరిసిల్లతో పాటు గర్షకుర్తి, చొప్పదండి, చామన్‌పల్లి, వేములవాడల్లో కూడా చేనేత కార్మికులు ఉన్నారు. కేవలం దుస్తుల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వారికి పని లేకపోవడంతో పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయింది. దీంతో జీవనానికి కూడా గడ్డు పరిస్థితి ఏర్పడడంతో మానసిక స్థైర్యం కోల్పోయిన కొందరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇదీ ప్రభుత్వాన్ని.. ప్రజలను కలచివేస్తోంది.. అయితే నేతన్నలకు పని భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగా నూలు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. నూలు డిపో ఏర్పాటుతో వారికి పని కలుగుతుందని, తద్వారా ఆదాయం నేతన్నలకు ఆదాయం వస్తుంది. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుందని ప్రభుత్వ ఆలోచన.
నూలు సరఫరా జరిగేదిలా…
సిరిసిల్లలో 120కు పైగా మరమగ్గాల సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో సుమారు 15 వేలకు పైగా నేతన్నలు ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గర్షకుర్తి, చొప్పదండి, చామన్ పల్లి ఇతర అనేక ప్రాంతాల్లో నేత కార్మికులున్నారు. వీరందరికీ నూలు సరఫరా చేయడానికి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం 20శాతం డబ్బులు డిపోలో చెల్లిస్తే 80బ్యాంకు గ్యారంటీ ద్వారా మరమగ్గాల సంఘాలకు నూలు సరఫరా అవుతుంది. అలాగే సహకార సంఘాల నుంచి నేత కార్మికులకు నూలు సరఫరా చేస్తారు. డిపో ద్వారా పాలిస్టర్, కాటన్ నూలు రెండు లభిస్తాయా ? లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. దీనివల్ల నేత కార్మికులకు మదుపులు లేకుండా నూలు లభిస్తుంది. వారి శ్రమకు వచ్చిన ఆదాయంతో జీవనోపాధి సాగించవచ్చు. గతంలో మూడు అంచెలు విధానం నుంచి రెండు అంచెల విధానానికి మారడం వల్ల కార్మికులకు లాభసాటిగా ఉంటుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముప్పై ఏళ్ల కోరిక…
నూలు డిపో ఏర్పాటు చేయాలని ముప్పయి ఏళ్లుగా చేనేత కార్మికులు కోరుకుంటున్నారు. గతంలో ఆసామీలు నూలు సరఫరా చేయడం వల్ల కార్మికులకు లాభసాటిగా ఉండేది కాదు. ప్రస్తుతం ఆసామీలు లేకపోవడం.. నేరుగా సంఘాల ద్వారా నూలు సరఫరా కావడంతో మదుపులు పెద్దగా ఉండవని కార్మికుల అభిప్రాయం. కాటన్ వస్త్ర పరిశ్రమ పునర్జీవం వల్ల అనుబంధ పరిశ్రమలైన సైజింగ్, డైయింగ్ పరిశ్రమలు ప్రాణం పోసుకోనున్నాయి. 30 సంవత్సరాలుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురుచూస్తున్న కల నూలు డిపో ఇన్నేళ్లకు సకారం కానుంది.