మక్తల్, జనవరి 31 (ప్రభ న్యూస్) : సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పాలమూరును ప్రగతి పథంలో నడిపిస్తానని సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో 25 రోజుల పాటు చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం నుండి ప్రారంభించిన వంశీచందర్ రెడ్డి హిందూపూర్ వద్ద జరిగిన కార్నర్ సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని పాలించిన పాలకులు పదేళ్లుగా పాలమూరు జిల్లాను రాజకీయాలకు వాడుకున్నారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రగతికి దూరమైన పాలమూరును పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు.
తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం తప్ప తనకు రాజకీయ జీవితాన్ని కల్పించిన పాలమూరుకు చేసింది ఏమీ లేదని ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తారు. పాలమూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ఇక్కడి సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో అభివృద్ధికి అడుగు వేయాలనే సంకల్పంతోనే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఏది చేయాలనుకుంటే అది చెబుతుంది తప్ప ఎప్పుడూ చెప్పిన మాట తప్పదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నారాయణపేట జెడ్పీ చైర్ పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, కే.నాగరాజ్ గౌడ్, జి.గోపాల్ రెడ్డి, జి.రవికుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.