Wednesday, November 13, 2024

త‌మ భూమి ద‌క్కే వ‌ర‌కు ఉద్యమిస్తాం

మండల పరిధిలోని గల కొప్పునూరు గ్రామ ప్రజలు ఈరోజు మా భూమి మాకే కావాలని ఉద్యమాన్ని తలపించేలా ఉప్పెనలా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి స్వ గ్రామస్తురాలు చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా పరిషత్ సభ్యురాలు కెసి రెడ్డి వెంకటరమణ చిన్నారెడ్డి, గ్రామ ఎంపీటీసీ తగరం లక్ష్మి కురుమయ్య, గ్రామ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, తదితరులు మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు సంబంధించిన భూమి సర్వే నెంబర్ 451, 52, 53, 461/ ఆ 463/ ఆ 464, 65, 66/1, 467/1 గల 116.10 ఎకరాల గల భూమిని గ్రామానికి సంబంధించిన పూర్వీకులు పశుగ్రాసం కోసం 1938 సంవత్సరంలో కొనుగోలు చేశారని అన్నారు. స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగ చట్టం ప్రకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉమ్మడి వీపనగండ్ల మండలం తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత భూమి కొప్పునూరు గ్రామ ప్రజల పేరుతో నమోదు చేయబడింది.

నాటి నుండి నేటి వరకు గ్రామ ప్రజలకు సంబంధించిన భూమిలోనే పశుగ్రాసం కోసం పాడి పరిశ్రమ రైతులు ఉపయోగించుకుంటున్నారని, అయితే ఇదిలా ఉండగా రాయలసీమ ప్రాంతం నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చిన దాముగట్ల నాగేష్ అనే వ్యక్తి కొప్పునూరు గ్రామంలో మకాం వేసి ప్రజలను మభ్యపెడుతూ సంబంధిత భూమిపై కన్నేసి అన్నం పెట్టిన కంచానికి సున్నం పూసే ప్రయత్నం చేశాడని, సంబంధిత అధికారులకు ఎంత లంచం ఇవ్వాలో అంతకు పై రెట్టింపు ఇచ్చి కొంత స్థానిక అక్రమార్కులతో కుమ్మక్కై సంబంధిత భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడ‌న్నారు. పైగా తనదే భూమి అంటూ సంబంధిత గ్రామ ప్రజల పై తిరుగుబాటు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తున్నారని వివిధ రకాలుగా వాపోయారు. గ్రామ ప్రజలకు సంబంధించిన భూమిని చేజిక్కించుకునే వరకు ఉద్యమం ఆపమని, అక్రమార్కులపై చర్యలు చేపట్టే వరకు యుద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement