Friday, November 22, 2024

MBNR: నిరుపేద బాలికలకు అండగా వీజేఆర్ ఫౌండేషన్.. జగన్నాథ్ రెడ్డి

మక్తల్, ఆగస్టు 9(ప్రభన్యూస్) : వీజేఆర్ ఫౌండేషన్ నిరుపేద బాలికలకు అండగా ఉంటుందని మక్తల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, వీజేఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. ఆయన బాలికలకు సైకిల్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 600 మంది బాలికలకు 600 సైకిళ్లు పంపిణీలో భాగంగా బుధవారం రోజు మక్తల్ పట్టణంలోని తన నివాసంలో స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 50మంది బాలికలకు సైకిళ్లను అందజేసి సైకిల్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో పలుచోట్ల విద్యార్థులు చదువుకోవడం కోసం మూడు నాలుగు కిలోమీటర్ల దూరం తమ గ్రామం నుండి మరో గ్రామానికి నడుచుకుంటూ వెళ్లడం చూశానన్నారు.

పలు సందర్భాల్లో వారిని తన వాహనంలో తీసుకుని వెళ్లి చదువుకునే దగ్గర దింపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఏడాదికాలంగా సైకిళ్లను పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితుల దృష్టా సాధ్యం కాలేదని, ఎట్టకేలకు సైకిళ్ల పంపిణీ చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి సమయానికి పాఠశాలకు చేరుకోలేక క్లాసులు మిస్ అవ్వడమే కాకుండా సాయంత్రం ఇంటికి కూడా సరైన సమయానికి చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతుండడం చాలా బాధ వేసిందన్నారు. విద్యార్థులకు, పాఠశాలలకు ఇప్పటివరకు వీజేఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.

పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, స్కానర్లు, కంప్యూటర్లు, డ్యూయల్ బెంచీలు, పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్, ఉన్నత చదువులకు వెళ్లే నిరుపేదలకు ఆర్థిక సాయం వంటి ఎన్నో సహాయం చేయడం జరిగిందన్నారు. అయితే నడుచుకుంటూ వెళ్లి చదువుకునే బాలికల కోసం సైకిళ్ల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠశాల వద్దకు వెళ్లి అక్కడే సైకిళ్లను అందజేయనున్నట్లు వర్కట్టం జగన్నాథ్ రెడ్డి వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే ప్రజా ప్రతినిధిగా అవకాశం దక్కితే మరింత సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement