గద్వాల ప్రతినిధి, డిసెంబర్ 2 (ప్రభ న్యూస్) : ఆదివారం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ (క్రింది సూచనలు) పాటించి జిల్లా పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలీస్ వారి సూచనలు..
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రేపు గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల శాసన సభ ఎన్నికల కౌంటింగ్ జరిగే గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల అవరణంలో, పరిసర ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా గుమికూడి ఉండరాదు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. గెలుపొందిన అభ్యర్థులను అర్ఓ లు ప్రకటించిన తరువాత ధృవీకరణ పత్రం అందుకునేందుకు అభ్యర్థితో పాటు ఇద్దరికి మించి లోపలికి వెళ్లరాదన్నారు. అభ్యర్థుల విజయాలకు సంబంధించి ఎవరు కూడా ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదన్నారు. అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఎవరు కూడా ఉద్రేకాలకు లోనై ఇతరుల మీదకు వెళ్లి గొడవలు సృష్టించినా, ఇతరులను భయ బ్రాంతులకు గురి చేసినా, ఆస్తులను ధ్వంసం చేసినా, ఓడిన అభ్యర్థులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అలాంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కావున ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించిన గైడ్ లైన్స్ ను ప్రజలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు.