నారాయణపేట : కోడల్ని చంపిన కేసులో మామకు పదేళ్ల పాటు కఠిన కారాగార జైలు శిక్ష, రూ.5000 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ జడ్జ్ మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణ పోలీస్ స్టేషన్ లో హత్యా నేరం కింద నమోదైన కేసులో శుక్రవారం జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుమల్ గ్రామానికి చెందిన మహదేవ్ కు లక్ష్మితో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొన్నేళ్ళ తర్వాత లక్ష్మీ భర్త మహదేవ్ అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన తర్వాత లక్ష్మి తన అత్తగారింట్లోనే ఉంటూ జీవనo కొనసాగిస్తుoడగా మహాదేవ్ తండ్రి పోతు శాoతప్ప కోడలు లక్ష్మీతో తరచుగా గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో కోడలు లక్ష్మీ పై అనుమానంతో మామ శాంతప్ప 2019 సంవత్సరంలో ఆమె పై దాడి చేయగా లక్ష్మీ తలపలిగి చనిపోయింది. లక్ష్మి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు పై అప్పటి ఎస్.ఐ నరేష్ కేసు నమోదు చేశారు. అప్పటి మక్తల్ సిఐ. వెంకట్ సరైన సాక్షాదారాలను కోర్టులో సమర్పించగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (మహబూబ్ నగర్) బెక్కం జనార్ధన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ/సి G. విక్రమ్ దేవ్ (నారాయణపేట) ప్రాసిక్యూషన్ నిర్వహించారు. నిందితుడు పోతు శాంతప్ప పై నేరం రుజువు కావడంతో నారాయణపేట జిల్లా సెషన్స్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో తమవంతు కృషి చేసిన ఏఎస్ఐ బాలకృష్ణ (కోర్టు లైజన్ ఆఫీసర్), కానిస్టేబుల్ విజయ్ (కోర్టు లైసన్ ఆఫీసర్), కానిస్టేబుల్ సంపత్ ( కోర్టు డ్యూటీ ఆఫీసర్) లను ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు అభినందించారు.