గద్వాల (ప్రతినిధి) జూన్ 2 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ పోస్టింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ హాజరై ఫ్లాగ్ పోస్టింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
అదేవిధంగా స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన నడిగడ్డ వాస్తవ్యులైన పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్ ల తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఆ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్. తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను సన్మానించారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రితిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితా తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్, అదనపు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగఫలితమే ప్రత్యేక తెలంగాణ…. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి
మక్తల్, జూన్2 (ప్రభ న్యూస్) : అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో 1200మంది విద్యార్థి యువకులు బలిదానం చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సోనియమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ దశమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ప్రజా భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అమరుల ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం… ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట జూన్ 2, ప్రభ న్యూస్ : తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు, ఆత్మబలి దానాల వల్ల మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రజా భవన్ క్యాంపు కార్యాలయం, మునిసిపాలిటీ, ఆర్డీవో తదితర కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి నియోజకవర్గం ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలపైనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటంలో అసువులు బాపిన అమరుల కుటుంబాలను, ఉద్యమ నాయకులను గౌరవించుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, అమరవీల కుటుంబ సభ్యులు, ప్రజలు, అభిమానులు పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, మహిళలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.