అచ్చంపేట జులై 1, ప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోనే నేటి వరకు చరిత్రలో ఎక్కడా, ఎవ్వరు చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి, వైద్య శాఖామంత్రి దామోదర రాజనరసింహాల సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలు దాదాపు 1230 మందికి పూర్తి ఉచితంగా మెగా సర్జికల్ క్యాంపు ద్వారా అన్నిరకాల ఆపరేషన్లను చేయడం ఆనందంగా వుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆదివారం 462 ఆపరేషన్లు పూర్తి కాగా.. సోమవారం నాటికి 100ఆపరేషన్లను పూర్తి చేసామని, ఇప్పటి వరకు 562 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని, మిగతా 60మందికి జులై 8న పూర్తి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
దాదాపు 400మందికి ఫైల్స్, ఫిస్టుల్లా, థైరాయిడ్, గాల్‌బ్లాడర్, కిడ్నీలలో రాళ్లు మొదలగు ఆపరేషన్లను హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఈఎన్‌టి, జిహెచ్‌ఎం లాంటి ఆసుపత్రుల్లో పూర్తి ఉచితంగా చేయించడం జరిగిందని, నేటితో మెగా సర్జికల్ క్యాంపులో నమోదు చేసుకున్న వారందరికీ పూర్తి స్థాయిలో అన్ని ఆపరేషన్లను పూర్తి చేసామన్నారు. ఏరియా ఆసుపత్రికి ఐసియూ మంజూరైనందున అన్ని సీరియస్ కేసులను అడ్మిట్ చేసుకొని చికిత్స అందించేలా త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. రెండవ మెగా సర్జికల్ క్యాంప్‌ను తిరిగి 3 నెలల తర్వాత మొదలు పెడుతామన్నారు.
పదర, సిద్దాపూర్, వంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2వ దశ మెగా సర్జికల్ క్యాంపు ద్వారా ఉచిత ఆపరేషన్లు చేస్తామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్యూబెక్టమీ, సిజేరియన్ ఆపరేషన్లు చేసేలా, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మెగా సర్జికల్ క్యాంపులో సహకరించిన ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రమేష్ చంద్ర, వనపర్తి జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి డాక్టర్ ఆల శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ తారాసింగ్, అనస్తీసియా డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రేమ స్వరూప, డాక్టర్ బంధం శ్రీనివాసులు, ఆపరేషన్ థియేటర్ సహాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తీసియా డాక్టర్ ప్రభు, బ్లాక్ కాంగ్రేసు అధ్యక్షులు గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.