అచ్చంపేట మే 9, ప్రభ న్యూస్ : సామాజిక న్యాయం మోదీ వల్లే సాధ్యమని, మోడీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర ప్రసార, పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని భాజాపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మోడీ వల్లే దేశంలో సామాజిక న్యాయంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో 27 ఓబిసి, 12 ఎస్సీ, 10 మహిళా, 9 ఎస్టీ వర్గాల వారికి చోటు కల్పించడమే మోడీ సామాజిక న్యాయానికి నిదర్శనమని 12 మంది ఎస్సీ మంత్రులలో తాను ఒకరిని అని అన్నారు. ఈ ఎన్నికలలో భాజాపా 400 సీట్లు గెలిచి ముచ్చటగా మూడవసారి కూడా మోడీనే ప్రధానమంత్రి కావడం గ్యారెంటీ అని అన్నారు. మోడీ వల్లే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లో 2 వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతి పెద్ద, ఇండియాలోనే మొట్టమొదటిగా సోమశిల ఐకాన్, హైవే బ్రిడ్జి నిర్మాణం మంజూరి చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
మోడీ గొంతులో ఊపిరి వున్నంత వరకు రిజర్వేషన్లను తీయనీయడని, గత అసెంబ్లీ ఎన్నికలలో పేరేడ్ గ్రౌండ్‌లో మందకృష్ణ మాదిగతో కలిసి ఎస్సీ వర్గీకరణ హామీ, నిన్న వరంగల్ మీటింగ్‌లో రిజర్వేషన్లపై ఇచ్చిన క్లారిటీ, ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లలో కుదింపు చేయకుండా అగ్రవర్ణాల నిరుపేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కల్పించడం, 2014లో రాష్ట్రపతిగా దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు నేడు ఆదివాసి మహిళ అయిన ముర్మును రాష్ట్రపతిగా ఈ దేశానికి అందిచడం మోడీ సామాజిక న్యాయానికి నిదర్శనం కాదా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీయే రంగనాథ్ కమిషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీల రిజర్షేన్లను తొలగించాలని ప్రయత్నించారన్నారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా జోగులాంబ అమ్మవారి గుడిని అభివృద్ది చేసిట్లుగానే ఉమామహేశ్వర దేవాలయాన్ని కూడా చేయుటకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు.
30 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో పోతుగంటి రాములు నిస్వార్థంగా, సాదాసీదాగా జీవిస్తూ ప్రజలకు సేవలందిస్తూ వచ్చారని, ఆయన వారసుడైన పోతుగంటి భరత్ ప్రసాద్‌ను పార్లమెంట్ అభ్యర్థిగా పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే అలంపూర్, మున్ననూర్ బూత్‌పూర్ హైవేలు, గద్వాల నుండి దోర్నకల్ రైల్వే లైన్‌లతో పాటు ఇక్కడ ఆయుర్వేద యూన్సివర్సీటిని మంజూరు చేయిస్తాడని హామీ ఇచ్చారు. మే 11న చివరి పార్లమెంట్ ప్రచారం ముగింపునకు వనపర్తికి కేంద్రమంత్రి అమిత్‌షా వస్తున్నారని, ఆ మీటింగ్‌కు భాజాపా శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంగ్యా నాయక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండికారి బాలాజీ, రాష్ట్ర, జిల్లా నాయకులు నరేందర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, సైదులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ముక్యాల రేణయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి, స్థానిక నాయకులు గోపాల్ యాదవ్, పత్యా నాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.