Friday, November 22, 2024

MBNR: పేదల ఆరోగ్య సంరక్షణకే రాజీవ్ ఆరోగ్యశ్రీ… ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, డిసెంబర్10 (ప్రభ న్యూస్) : నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు పేదలందరికీ వైద్య ఖర్చు అందించడం జరుగుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ‌ మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డీఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మితో కలిసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సర్వీసు కార్యక్రమానికి కూడా ఆయన ప్రారంభించారు. సందర్భంగా మహిళలతో ఆయన ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే శ్రీహరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిరుపేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్య పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలను రెండవ రోజునే అమలు చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, టీఎస్ఆర్టీసీ రీజినల్ మేజర్ బాబు నాయక్, స్థానిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement