గద్వాల (ప్రతినిధి) జూన్ 22 (ప్రభ న్యూస్) : జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యoగా పని చేస్తామని జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు అన్నారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, విద్వేషాలను రెచ్చగోట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
మహిళల రక్షణ కోసం, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతామని, అలాగే దొంగతనాల నిరోధానికి మరిన్ని సి.సి కెమెరాలు ఏర్పాటు చేయించడంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకు ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చొరవ తీసుకుంటానన్నారు. చెడు పనులను ఎవరు ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ అన్నారు. ఈ మీడియా సమావేశంలో డీ. ఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.