గద్వాలప్రతినిధి, ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు మొగలాయి అరచకాల్ని ఎదిరించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా గౌడ కుల సంఘ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ..సబ్బండ వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని స్థాపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని వర్ధంతి సందర్భంగా సరిత తిరుపతయ్య పిలుపునిచ్చారు. రాచరిక వ్యవస్థ నీడలో జమిందారీ, జాగీర్దార్లు సాగిస్తున్న అరాచకాలను చూసి కోపోద్రేకుడైన బహుజన కులాలను ఏకం చేసి పోరాటం సాగించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు గాను కృషి చేస్తానని, స్థల సేకరణ చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తామని గౌడ కుల సంఘం నాయకులకు సరిత తిరుపతయ్య హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.