Tuesday, November 26, 2024

నిధులున్నా నిర్మాణాలకు నోచుకోని పంచాయతీ భవనాలు..

వీపనగండ్ల : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది వీపనగండ్ల మండలంలోని పంచాయతీ భవన నిర్మాణ పనుల పరిస్థితి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నూతనంగా పంచాయతీ భవనాలను నిర్మించటానికి నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో గుత్తేదారులు పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో పనులు నేటికి మొదలు పెట్టలేక పోయారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో భవనాలను అద్దెకు తీసుకుని సర్పంచ్ లు గ్రామ పంచాయతీ కార్యాలయలను ఏర్పాటు చేశారు. సరైన వసతులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని హంగులతో నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేయగా అధికారుల అలసత్వంతో పలు గ్రామాలలో నిర్మాణ పనులు ముందుకు సాగకపోగా మరికొన్ని చోట్ల పనులు మొదలుపెట్ట లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రమైన వీపనగండ్ల మోడల్ పంచాయతీ భవనాన్ని నిర్మించడానికి 50లక్షల రూపాయలు మంజూరు కాగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో 2019 సంవత్సరంలో భవన నిర్మాణానికి మంత్రులు నిరంజన్ రెడ్డి ..శ్రీనివాస్ గౌడ్ లు శంకుస్థాపన చేశారు. సంబంధిత వెదర్ భవన నిర్మాణానికి ముగ్గు పోసి వదిలి వేశారు. నిర్మాణ పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయింది.స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి నిర్మాణ పనుల గురించి పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన పట్టించుకోవడంలేదని తెలిపారు.బొల్లారం గ్రామంలో చేపడుతున్న పంచాయతీ భవన కార్యాలయ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.కాల్వరాల లో నూతన పంచాయతీగా ఏర్పడిన వల్లభాపురం తండాలో భవనాల పనులు నత్తనడకన కొనసాగిస్తున్నారు. నూతన పంచాయతీగా ఏర్పడిన రంగవరం,నాగర్ల బండ తండా,కొర్లకుంట గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పంచాయతీలకు ఇప్పటి వరకు నూతన భవనాలకు నిధులు కూడా మంజూరు కాలేదు. గోపాల్ దిన్నె, గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, సంపత్రావు పల్లి,ఫుల్గార్ చెర్ల,వల్లబాపురం లో ఒకొక్క పంచాయతీ భవనానికి 20లక్షల రూపాయలు మంజూరు కాగా పనులను నేటికి మొదలుపెట్టలేదు.అధికారులు నిర్మాణ పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని నూతన పంచాయతీలకు భవనా నిర్మాణలకు నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement