మహబూబ్‌నగర్ : దోపిడి దారులను , దళారులను ఏ మాత్రం గుర్తించక పొట్ట కూటి కోసం పండ్లు , కూరగాయలు అమ్ముకునే వారిని లక్ష్యంగా చేసుకుని పాలమూరు జిల్లా కేంద్రంలో మున్సిపల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు….ఇలాంటి వ్యవహార శైలి సభ్య సమాజానికి సిగ్గు చేటు. అయ్యా మేము బతుకలేక ఇక్కడ అమ్ముకుంటున్నాం. కాళ్లు మొక్కుతామంటూ వేడుకున్నా కూడా కనికరించలేదు ఆ సిబ్బంది…కూరగాయలు , పండ్లు వారి దగ్గరి నుండి బలవంతంగా లాక్కొని చెత్త ట్రాక్టర్లో పారవేస్తూ ఝులూం ప్రదర్శించారు. ఈ సంఘటనని ప్రత్యక్షంగా గమనించిన ఆంధ్రప్రభను చూసిన మున్సిపల్ సిబ్బంది అక్కడి నుండి మెళ్లిగా తోక ముడిచారు. పేరుకే రైతుబజార్ పాలమూరు జిల్లా కేంద్రంలో కొనసాగే ఈ మార్కెట్‌లో అంతా మధ్య దళారులే. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను అగ్గువకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతన్నలది. పూట గడవక మూడు పూటలా తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు సెంటు భూమి లేని నిరుపేదలు గ్రామీణ ప్రాంతంలోని రైతన్నలు పండించిన పండ్లు , కూరగాయలను తమకు గిట్టుబాటు అయ్యేటట్లుగా పాలమూరు జిల్లా కేంద్రానికి ఆపసోపాలు పడుతూ తీసుకువస్తారు. అనంతరం పాలమూరు పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం , మెట్టుగడ్డ , క్లాక్ టవర్ , పాత బస్టాండ్ , రామ్ మందిర్ చౌరస్తా , ఎర్ర సత్యం చౌరస్తా , ప్రధాన రోడ్ల పక్కన తాము తీసుకువచ్చిన పండ్లు , కూరగాయలను అమ్ముకుంటుంటారు. వీరి కోసం ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర మంత్రి ఇప్పటికే పాల మూరు పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ పేరుతో రోడ్లకు ఇరువైపులా వ్యాపార సమూహాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అవి పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులోకి రాలేదు. 20 ఏళ్లుగా తమ పొట్ట పోసుకునేందుకు నిరుపేదలు మహబూబ్‌నగర్ జిల్లా మారుమూల మండలాలైన గండీడ్ , నవాబ్‌పేట , కోయిలకొండ, హన్వాడ , భూత్పూర్ ప్రాంతాల నుండి 386 మందికి పైగా ప్రతి నిత్యం పండ్లు , కూరగాయలు అమ్ముకొని అసలు నగదును సంబందిత రైతుకు మారు బేరగాళ్లకు ముట్టజెబుతారు. వచ్చిన గిట్టు బాటు లాభంతో తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఈ సీజన్‌లో బాగా పండే పండ్లు కర్బూజ , పుచ్చకాయ , ద్రాక్ష , జామ , సపోట తో పాటుగా కూరగాయలను ఎక్కువ మొత్తంలో పాలమూరు పట్టణంలోని బస్టాండ్ , కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం నుండే తమ వ్యాపారాన్ని మొదలుపెడతారు. వీరిపై చాలా రోజుల నుండి ఎలాంటి అధికారం లేని వారు తమ హోదాను అడ్డపెట్టుకొని మనస్సులో ఏముంటుందో కానీ కూరగాయల అమ్మకానికి వచ్చే వారిని మానసికంగా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక మంత్రి స్వయంగా వీధి వ్యాపారులను అక్కున చేర్చుకొని అండగా నిలుస్తున్న సందర్భంలో సిబ్బంది వ్యవహార శైలి , ప్రవర్తనపై సర్వత్ర విమర్శలు వినబడుతున్నాయి. నడిరోడ్డు పై వారు కూరగాయలు , పండ్లు అమ్ముకోవడం లేదంటూ సమస్యలేమైన ఉంటే సర్ది చెబితే సర్దుకుపోయే సమస్య అయినప్పటికి సాగదీసి సతాయించడం సరియైన చర్య కాదంటూ పట్టణ వాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకుని వారికి వ్యాపారం చేసుకునేందుకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు లేకుండా సహకరించండి: మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ పట్టణంలో కలెక్టరేట్ ఆవరణ ముందు ప్రధాన కూడళ్లలో రోడ్లకు ఇరువైపులా పలువరు రైతులు , వ్యాపారులు అనుమతులు లేకుండా పండ్లు , కూరగాయలు అమ్ముతున్నారు. ఈ అమ్మకాల వల్ల రోడ్డు విస్తరణలో బాగంగా తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తే ప్రభుత్వం ద్వార ప్రత్యేకంగా అమ్ముకునే వెసులుబాటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
Advertisement
తాజా వార్తలు
Advertisement