బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ బంజర్ మెజార్టీతో విక్టరీ కొట్టింది. బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా గల్లంతయ్యింది. బద్వేల్‌లో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 90 వేల 590 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 1,47, 213 ఓట్ల పోల్ కాగా, 1, 46, 983 ఓట్లను ప్రకటించారు. వైసీపీకి 1, 12, 221 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, 678 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు వచ్చాయి. ఒక ఈవీఎంలో ఫలితం తేలలేదు. ఈ ఈవీఎంలో 230 ఓట్లున్నాయి. కాగా, డాక్టర్ సుధకు వచ్చిన మెజార్టీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ.
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి 90,110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75,243 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి సుపరిపాలన, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు డాక్టర్ సుధ. తన విజయానికి సహకరించిన వైసీపీ నేతలకు, బద్వేల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి సుధ ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు.