మక్తల్, జులై 15(ప్రభ న్యూస్) : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇవాళ ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో నారాయణపేట డిపో మేనేజర్ లక్ష్మీసుధతో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా కండక్టర్ కు డబ్బులు చెల్లించి మొదటి టికెట్ ను ఎమ్మెల్యే కొనుగోలు చేసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి బస్సు సదుపాయం కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు మక్తల్ నుండి ఊట్కూరు మీదుగా ఓబులాపూర్ పగిడిమారి మీదుగా నారాయణపేట వరకు ప్రతిరోజు రెండు పూటలా బస్సు సర్వీస్ నడుస్తుందని తెలిపారు. బస్సు సదుపాయంతో ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యలు దాదాపుగా పరిష్కారమైనట్లేనన్నారు. ఆయా గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు.
కాగా నర్వ మండలంలో నాగిరెడ్డి పల్లి వద్ద వనపర్తి డిపోకు చెందిన బస్సు ఆత్మకూరు నుండి అమరచింత, నాగల్ కడ్మూర్ నర్వ, పాతర్ చేడ్ మీదుగా రాయికోడ్ వరకు మరో బస్సు సర్వీసును కూడా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, ఊట్కూర్ మాజీ సర్పంచ్ కే. సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి ,కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ గౌడ్, బి.గణేష్ కుమార్, నూరొద్దీన్, యగ్నేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.