మహబూబ్‌నగర్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండవ దశ కోరలు చాస్తున్న సందర్బంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కఠిన ఆంక్షలు విధించాయి. వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్కు తప్పనిసరి చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా వినియోగించాలంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పి రెమా రాజేశ్వరి జనసమూహం ఎక్కువగా ఉండేచోట మాస్కులు వాడని వారిపై రూ.1000 జరిమాన తో పాటు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు. మాస్కు వాడకపోతే మహమ్మారి ఏదో ఒక రూపంలో ఎటాక్ చేస్తుందని అటు ప్రభుత్వం , ఇటు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే మాస్కు ఒక్కటే మార్గమని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కు వాడటంతో పాటు శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులను తరచూ శుభ్రపరుచుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు , పనిచేసే స్థలాల్లో ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు మాస్కును ఖచ్చితంగా ధరించాలని అధికారులు చెబుతున్నారు.అంతే కాకుండా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో తప్పనిసరి అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని , నిత్యవసర సరుకులు , కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని , అంతే కాకుండా తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో పక్క నెలరోజుల పాటు పండుగలు , సభలు , ర్యాలీలు , శుభ కార్యాలు ఎక్కువ మందితో కలిసి జరుపుకోరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ నిబంధనలను అదిగమించిన వారికి కఠినంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో జాతరలు , పండుగలు ఎక్కువగా ఉన్నందున జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రజలు ఎక్కువగా గుమికూడవద్దని , అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏప్రిల్ మాసంలో హిందూవులకు సంబంధించి శ్రీరామ నవమి , ఉగాది , అదే మాసంలో రంజాన్ కూడా రావడంతో ఎక్కడి వారు అక్కడే పండుగలు జరుపుకోవాలని , విందులు , వినోదాలు పరిమిత సంఖ్యలో నిర్వహించుకోనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ టీకాపై ప్రజలు అపోహలు వీడి , ప్రతి ఒక్కరు టీకా వేసుకునేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని , ముఖ్యంగా 45 ఏళ్ల పైబడిన వారందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని జిల్లా అధికారులు కూడా టీకా పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం వల్ల టీకా కేంద్రాలను కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని , ఇక నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కరోనా టీకాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. కరోనా ను అరికట్టేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తూ తప్పనిసరిగా మాస్కులు , శానిటైజర్‌లు లేనిదే బయటకు రాకూడదని ప్రభుత్వం , జిల్లా అధికారులు కోరుతున్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement