మహబూబ్ నగర్, సెప్టెంబర్ 18, (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అత్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలో విశాలమైన రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ తదితర పనులను పెద్ద ఎత్తున చేపట్టినట్లు వెల్లడించారు.పట్టణంలో వివిధ జంక్షన్లలో రూ. 3 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టగా… మంగళవారం నాడు ఆయన పలు చోట్ల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా భూత్పూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన అర్బన్ కాన్సెప్ట్, పాలకొండ బైపాస్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ ఫౌంటెన్, పిస్తా హౌస్ సమీపంలో తీర్చిదిద్దిన తల్లి బిడ్డ, అప్పన్నపల్లి వద్ద బటర్ఫ్లై ఫ్లైయింగ్ ట్రీ కాన్సెప్ట్ జంక్షన్ల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకోగా… మంగళవారం నాడు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వాటిని పరిశీలించారు.
పట్టణ వాసులకు ఆహ్లాదం పంచేలా సాధ్యమైనంత త్వరగా వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన బైపాస్ రోడ్డు నిర్మించామని, బైపాస్ రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ పనులు కూడా త్వరలో పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. పట్టణంలో 18 జంక్షన్లను రూ.3 కోట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా అందమైన పెద్దపెద్ద మొక్కలను కూడా నాటి పచ్చదనాన్ని పెంచుతున్నామన్నారు. విశాలమైన రోడ్లు, అందమైన జంక్షన్లు, వివిధ రకాల మొక్కలు, సెంట్రల్ లైటింగ్ తో పట్టణంలోని రోడ్డు అందంగా ముస్తాబవుతున్నాయని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.