Saturday, November 23, 2024

ఏం చేశార‌ని మీకు ఓట్లు వేయాలి… మోడీకి కెటిఆర్ సూటి ప్ర‌శ్న‌..

నారాయ‌ణ‌పేట : తెలంగాణ‌కు ఏం చేశార‌ని మీ పార్టీకి ఓట్లు వేయాల‌ని ప్ర‌ధాని మోడీని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు.. ఈ గ‌డ్డ‌కు ఒక్క పైసాగాని, ప్రాజెక్ట్ గానీ అద‌నంగా తెచ్చారా అంటూ స్థానిక బిజెపి నేత‌ల‌ను గ‌ట్టిగా అడిగారు. ప్ర‌ధాని మోడీ కార్పొరేట్ల‌కు రూ. 12 ల‌క్ష‌ల కోట్ల రుణాలు మాఫీ చేశారని. తాను చెప్పింది అబ‌ద్ధ‌మ‌ని తేలితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఒక వేళ వాస్త‌వ‌మైతే బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నారాయ‌ణ‌పేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో మంత్రి కెటిఆర్ ప్ర‌సంగిస్తూ, . పాల‌మూరు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని తెలంగాణ‌ బీజేపీ నాయ‌కులు మోడీని కోరుతున్నార‌ని, అస‌లు ఏ ముఖం పెట్టుకుని పాల‌మూరులో ఓట్లు అడుగుతార‌ని వారిని నిల‌దీశారు.. పాల‌మూరు – రంగారెడ్డి ప‌థ‌కానికి మోకాల‌డ్డు పెట్టినందుకా? కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చ‌నందుకు ఓటు వేయాలా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపిచారు.

ఒకాయ‌న‌ మోడీ దేవుడు అని అంటున్నాడు. ఆయ‌న ఎవ‌రికి దేవుడు అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. సిలిండ‌ర్ రేటు పెంచి క‌ట్టెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడ‌బిడ్డ‌ల‌కు మోడీ దేవుడా? పెట్రోల్ రేట్ పెంచినందుకు మోడీదేవుడా..? అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. రాబోయే రోజుల‌లో రైతుల‌పై ఆదాయ‌పు ప‌న్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌ధాని మోడీ ఆర్థిక స‌ల‌హాదారు విబేక్ దేబ్‌రాయ్ నిన్న ఒక ప‌త్రిక‌లో వ్యాసం రాశారని ప్ర‌స్తావించారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయింద‌ని, డ‌బుల్ ఇంజిన్ పాల‌న‌లో రైతుల ఆదాయం డ‌బుల్ అయింద‌ని,ఇక రైతుల‌పై ఆదాయ‌పు పన్ను వేయాల‌ని ఆయ‌న రాసుకొచ్చారు. ఆదాయ‌మే లేద‌ని ఏడుస్తుంటే.. రైతు మీద ఆదాయ‌పు ప‌న్ను వేయ‌డం ఏమిట‌ని కెటిఆర్ అన్నారు. ఇక ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప‌నిమంతుల‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని అంటూ, కేసీఆర్ నాయ‌క‌త్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement