Wednesday, November 20, 2024

గద్వాలలో కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ : డీకే అరుణ

జోగులాంబ గద్వాల (ప్ర‌భ న్యూస్‌ ప్రతినిధి) : గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాల కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్, గతంలో గద్వాల జిల్లాకు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేక గద్వాలకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ నిన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అధికారులు అభివృద్ధి పై కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే అవసరం ఉందన్నారు. గద్వాల ప్రజలకు గొడ్డుకారం పెట్టడంలోనే నీ అభివృద్ధి కనిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కేసీఆర్ కుటుంబం దోచుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు రోడ్డులు మరమ్మతులు చేపట్టి లైట్లు వేసి అద్భుతంగా చేశారని, గద్వాల నియోజకవర్గం చాలా అభివృద్ధి జరిగిందని అనుకుంటున్న కేసీఆర్, కానీ గద్వాలలో తాను మంత్రిగా ఉన్న హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చేశానని అభివృద్ధి కేసీఆర్ చేశాడు అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టి గద్దె నెక్కి దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ భారత దేశాన్ని దోచుకోవాలని ఉద్దేశ్యంతో జాతీయ పార్టీ పెట్టాడని, బీఆర్ఎస్ పార్టీ ని స్థాపించే అర్హత కేసీఆర్ కు లేదని ఆరోపించారు. గతంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. అదే విధంగా వాల్మీకిలకు ఎస్టీ జాబితా చేర్చుతాం అని చెప్పిన మాటలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అనుకున్న కేసీఆర్ 10 నిమిషాలు మాత్రమే సభలో ప్రసంగం చేశారని ఎద్దేవా చేశారు. అధికారులు అధికార పార్టీకి కీలబొమ్మలుగా మారారని మండిపడ్డారు. నెట్టెంపాడు ప్రాజెక్టు 10శాతం పనులు 9 సంవత్సరాలు అవుతున్నా పూర్తి చేయకుండా గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా వజ్రతునక అవుతుందని చెప్పడం సిగ్గు చేటు అని ఆరోపించారు. పెద్దపెద్ద నాయకుల నాయకత్వాన్ని అణిచి వేయాలని ఉద్దేశ్యంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న చిన్న జిల్లాలుగా చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement