Friday, November 22, 2024

రైతులను రాజుగా చేయడమే కేసిఆర్ లక్ష్యం..

ఊట్కూరు : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఊట్కూరు మండల పరిధిలోని మెద్గుంపూర్ గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాం పాషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగ అని.. రైతుల పట్ల చిన్నచూపు చూడకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అండగా ఉంటున్నారన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతు పక్షపాతిగా దేశంలోనే నెంబర్ వన్ సీఎం గా పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తూ రైతు బంధు రైతు బీమా, నూతన వ్యవసాయ యాంత్రీకరణ ఉచిత విద్యుత్ మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. రైతులు పండించిన వరి పంట నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. వరి పంటకు క్వింటాలుకు రూ 1888, బి గ్రేడ్ కామన్ రకం రూ, 1866 ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్వహించిన కొనుగోలు కేంద్రంలో వరిని విక్రయించి లబ్ది పొందాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగులు కొరతలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ విధిగా ముఖానికి మాస్క్ వేసుకొని భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు వహించాలని సూచించారు. రైతు సంక్షేమానికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వెనుకబడిన ఊట్కూర్ మండలానికి సాగు నీరు తీసుకువచ్చి తన తండ్రి దివంగత నర్సిరెడ్డి ఆశయసాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పిటిసి అశోక్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, సర్పంచ్ సుశీలమ్మ, వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి, ఎంపీటీసీ కిరణ్ కుమార్, ఏ ఈ ఓ కల్పనా, కార్యదర్శి హుస్సేన్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ సుధాకర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement