మహబూబ్నగర్,జూలై 31 (ప్రభ న్యూస్):రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మారుస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ తొమ్మిదేళ్లు గడిచిన తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకొని రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా తయారు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు కేంద్రంగా ప్రజాపోరు పేరుతో బిజెపి శ్రేణులు జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి గడియారం చౌరస్తా వరకు మహా ర్యాలీ చేపట్టారు.
రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పాలమూరు గడ్డపై నుండి పోరు యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డికి జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనసాగతం పలికారు. ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి ర్యాలీ మొదలై బస్టాండ్ మీదుగా గడియారం చౌరస్తా వరకు కొనసాగింది. అంతకుముందు కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రజాకారులను తలపించే విధంగా సీఎం కేసీఆర్ నియంత అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో మొదటిసారి గద్దెనెక్కిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని చెప్పి దళితులకు వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. 2018లో మరోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కేసీఆర్ తొమ్మిదేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తన గారడి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల ఇండ్లు మంజూరు చేసిందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ల పేరుతో నిరుపేదలను మభ్యపెట్టి ఏ ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి నిజాం నవాబు కట్టుకున్నట్టుగా పదేకరాలలో తాను ఇల్లు కట్టుకున్నాడని విమర్శించారు.
అంతేకాక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు మరో 10 ఎకరాలు, బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి కూడా మరో పదేకరాలు కేటాయించాడు కానీ 9 ఏళ్ల గడిచిన ఏ ఒక్క లబ్ధిదారునికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న సోయి కెసిఆర్ కు లేదని అన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ తాను మాత్రం దోచుకుని దాచుకున్నాడని ఘాటుగా విమర్శించారు.
నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకొని ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. నియామకాల విషయానికొస్తే తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ వేయలేదని పేపర్ లీకేజీ తో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకున్నారని ఎన్నికల హామీగా చెప్పిన నిరుద్యోగ భృతి కలగానే మిగిలిందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి,జాతీయ రహదారులు కేంద్రం నిధులతోనే జరిగాయని స్థానిక బిఆర్ఎస్ నాయకులు తామేదో చేశామని ప్రజలకు గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు.
రైతులకు రుణమాఫీ చేస్తానని, రైతాంగానికి ఉచిత ఎరువులు ఇవ్వడం కొరకే తాను పుట్టానని గొప్పలు చెప్పిన కేసీఆర్ రైతులను కూడా మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్,బిఆర్ఎస్,ఎంఐఎం మూడు పార్టీల డిఎన్ఏ ఒకటేనని ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసిన ఒకరికి వేసినట్లుగానే అని కిషన్ రెడ్డి అన్నారు.ప్రజలకు విశ్వాసం నమ్మకం కల్పించేందుకే బిజెపి పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.
కెసిఆర్ నియంత పాలనను అంతమొందించాలంటే బిజెపి అధికారంలోకి రావాలి… జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తానే కెసిఆర్ నియంత పాలన అంతమవుతుందని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని చేపట్టిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో బిజెపి పోరుబాట పట్టిందని తెలిపారు. తొమ్మిదేళ్లు గడిచిన ఏ ఒక్క లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇండ్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఇస్తామని, దళిత బంధు,బీసీ బందు పేరుతో కేసీఆర్ మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. బిజెపి నాయకులు కార్యకర్తలు గడపగడపకు తిరిగి కెసిఆర్ మోసాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె కోరారు.పాలమూరు జిల్లాలో స్థానిక మంత్రి అరాచక పాలన చేస్తూ తన అహంకారంతో పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన అమాయకమైన ప్రజలపై కేసులు పెట్టి బెదిరించి వారి భూములు ప్లాట్లు లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేస్తూ లక్షల కోట్లు దండుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పాలమూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుందని ఆమె తెలిపారు. పాలమూరు నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ను ఊరు బయటకు తరలించి పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చి అక్కడ ఏం చేస్తున్నారో స్థానిక మంత్రి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జితేందర్ రెడ్డి, పి.చంద్రశేఖర్, నాగు రావు నామాజీ,పద్మజా రెడ్డి, ఆచారి,జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి,ఎన్.పి వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, ఇద్దరి నరసింహులు, కొండయ్య, ఇతర జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.