Saturday, November 23, 2024

MBNR: ప్రాజెక్టులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలా…!

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్): ప్రాజెక్టులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తారా అని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల 16న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని అసలు 60శాతం కూడా పూర్తికాని ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఎలా ప్రారంభిస్తారో ముందుగా పాలమూరు ప్రజలకు చెప్పిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించాలని గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…. 2017 జూన్ 11న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 55 శాతం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఈ లెక్కలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినవి కావని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులే పత్రికలకు మీడియాకు వెల్లబుచ్చినటువంటి వివరాలని అన్నారు. 55% పూర్తయిన ప్రాజెక్టును 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ 16న ప్రారంభించడమే కాకుండా 17న ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో కృష్ణా జలాలతో ఆయా దేవాలయాల దేవుళ్ళ పాదాలకు జలాభిషేకం చేయాలనీ ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శించారు.16న నార్లాపూర్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న ప్రాజెక్టు దగ్గర 9 మోటర్లు ఉండాలి.. కానీ ఒక్క మోటార్ మాత్రమే బిగించారని పేర్కొన్నారు. 9 మోటార్లకు సంబంధించి ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 145 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ అని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేస్తూ ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవానికి పూనుకున్నారని విమర్శించారు. నార్లపూర్ రిజర్వాయర్ కు దాదాపు రెండు కిలోమీటర్లు కాల్వ ద్వారా వచ్చి నీరు నిండుతుందని, అలాంటి నార్లాపూర్ రిజర్వాయర్ ఇంకా 35 శాతం పనులు పూర్తికాలేదని వివరించారు. అదేవిధంగా నార్లపూర్ రిజర్వాయర్ కింద ఆవాసం కోల్పోయిన భూ నిర్వాసితులు ఇప్పటివరకు కూడా ఇంకా ఖాళీ చేయలేదని ఆయన తెలిపారు.

నార్లాపూర్ నుండి ఏదుల, వట్టేం, కరివెనా రిజర్వాయర్లకు వచ్చే మెయిన్ కెనాల్ పనులు ఇంకా 70% పూర్తి కావాలని, పంప్ హౌస్ లు కూడా పూర్తి కాలేదని అన్నారు. కరివేనలో ఇంకా 40 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయని స్వయంగా నీటిపారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజాత్ కుమార్ డ్రైవ్ రన్ చేయడానికి వచ్చి స్వయంగా వివరించారని తెలిపారు. కరివేన పూర్తయిన తర్వాత అక్కడి నుండి ఉదండాపూర్ నీరు వెళ్లాలని మొత్తం 18 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ద్వారా ఉదండపూర్ కు నీరు వెళ్లాల్సి ఉండగా ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ కెనాల్ పనులు 15 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తిగా రద్దు చేశారని ఎద్దవా చేశారు. ఇదంతా సాధ్యం కావాలంటే శ్రీశైలం బాక్ వాటర్ నుండి 400 టిఎంసిలు వస్తేనే పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోసుకుని మనం నీరు వాడుకోవాలని తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లోపాయకారి ఒప్పందంతో కేసీఆర్ తో కుమ్మక్కై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద రోజు నాలుగు టీఎంసీలు దండుకుపోతున్నారని ఆపైన సంగమేశ్వరం దగ్గర కూడ మరో నాలుగు టీఎంసీలు మొత్తం రోజుకి 8 టీఎంసీల నీరు ఏపీ ప్రభుత్వం దోచుకుపోతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే సీఎం కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించాలని అక్కడే సభాముఖంగా పాలమూరు ప్రజలకు నీరు ఏ విధంగా ఇస్తారో కేసీఆర్ వివరిస్తే శిరస్సు వంచి కేసీఆర్ పాదాలకు పాదాభివందనం చేస్తానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ ప్రచార కార్యదర్శి బెనహర్ నాయకులు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement