Sunday, November 24, 2024

తెలంగాణ బోర్డర్ లో.. కిక్కే కిక్కు.. రెచ్చిపోతున్న సిండికేట్ దందా..

మానవపాడు, ఉండవెల్లి, ఏప్రిల్14 (ప్రభ న్యూస్) : తెలంగాణ, ఆంద్రప్రదేశ్ బోర్డర్ లో వెలిసిన ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలు.. బహిరంగ మద్యపానానికి అడ్డాలుగా మారుతున్నాయి.

మందు విందు ఒకే చోట..
పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వెలిసిన వైన్ షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ కు ఏర్పాటు చేయడమే కాకుండా, ఎవరికీ ఎలాంటి విందు కావాలో క్షణాల్లో పదుల సంఖ్యలో షాపుల్లో దొరుకుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మగ్గుతున్నారు. మందుబాబులు మాత్రం అక్కడ మద్యం కొని, పక్కనే తాగుతున్నారు. రద్దీ రహదారులు, నిత్యం వేలమంది రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కనే సిట్టింగ్‌ వేస్తున్నారు. తాగుతూ ఊగుతూ.. వీరంగం సృష్టిస్తున్నారు. అటుగా వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. తాగిన తర్వాత ఖాళీ సీసాల్ని అక్కడే పడేస్తున్నారు. పగలగొడుతున్నారు. అవి కాళ్లకు గుచ్చుకుని పలువురు గాయాలపాలైన సందర్భాలూ ఉన్నాయి. నేరాలకు తెగబడుతున్నారు. మద్యం కొన్నవారు ఆ దుకాణాల వద్ద, బహిరంగంగా తాగకుండా చూడట్లేదు. తగిన పర్యవేక్షణ లేకపోవటంతో ఏ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చూసినా బహిరంగ మద్యపానమే కనిపిస్తోంది.

అటు నడవాలంటేనే భయం.. భయం

పుల్లూరు టోల్ ప్లాజా ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చిత్రాలివి. మందుబాబులు ఇక్కడ రోడ్డు పక్కనే మకాం వేస్తున్నారు. బహిరంగంగా మద్యం తాగి, సీసాలను అక్కడే పడేసి పగలగొడుతున్నారు. సమీపంలోని జాతీయ రహదారిపై ఈ రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రమైతే చాలు.. అటువైపు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ఇది ఏమిటని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడి బందువులం అంటూ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. వైన్స్ షాపులు సిండికేట్ గా ఏర్పాటై బెల్టు షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగిస్తున్న పరిస్థితి. మానవపాడు, ఉండవెల్లి మండల కేంద్రాలలో నెలకొంది. గతంలో ఉన్న వాటి కంటే రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపుల ఏర్పాటుతో వైన్స్ షాపుల యజమానులు జేబులు నింపుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.

- Advertisement -

బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులు

ఎక్సైజ్ అధికారులు వైన్స్ షాపుల వైపు అసలు కన్నెత్తి చూడడం లేదు. నెలనెలా వారికి మామూళ్లు వైన్స్ షాపుల నుండి అందుతున్నాయని, దీంతో వారు ఇటువైపే రావడం లేదని మండల ప్రజలు అంటున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వలన వైన్స్ షాపు యజమానులు ఇష్టారీతిన బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారని, స్వయంగా ఎక్సైజ్ అధికారులే ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అంటున్నారు.

బెల్టుషాపులతో గ్రామాల్లో నేరాలు

గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణతో 18 సంవత్సరాలు నిండని యువకులు మద్యానికి బానిసై వారి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. కూలి పనులు చేసుకునే వారు వారికి పనిచేస్తే వచ్చే డబ్బులను బెల్టు షాపుల్లో మద్యానికే వేచ్చించడంతో వారి కుటుంబంలో గొడవలు వస్తున్నాయి. బెల్టుషాపులతో దొంగతనాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు ఈ సిండికేట్ దందాకు చెక్ పెట్టి.. వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement